Oct 17,2020 17:52
ప్రపంచ ఆకలిసూచిలో 94 స్థానంలో భారత్‌

న్యూఢిల్లీ : గ్లోబల్‌ హంగర్‌ సూచి(ప్రపంచ ఆకలి సూచి)లో భారత్‌ 94వ స్థానానికి దిగజారింది. ఇది అత్యంత తీవ్రమైన కేటగిరీ అని, పేలవమైన సంస్కరణల అమలు ప్రక్రియ, పర్యవేక్షణ లేకపోవడం, పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో వైఫల్యంతో అతిపెద్ద దేశమైనప్పటికీ..భారత్  అతి  తక్కువ ర్యాంక్‌కు పడిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. భారత జనాభాలో 14 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో స్టంటింగ్‌ రేటు (ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలు) 37.4 శాతం ఉండగా, వాస్టింగ్‌ రేటు (వయసుకు తగిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తు ఉండటం) 17.3 శాతంగా ఉంది. అలాగే ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటు 3.7 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. గతేడాది 117 దేశాలకు గాను భారత్‌ 102వ స్థానంలో నిలిచింది. జనాభా అధికం కావడంతో.. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పోషకాహార లోపం అధికస్థాయిలో ఉంది. దేశంలో ప్రతి ఐదో చిన్నారి యుపిలోనే జన్మిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్‌, మయన్మార్‌, పాకిస్తాన్‌లు కూడా ఇదే కేటగిరీలో నిలిచినప్పటికీ.. భారత్‌కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్నాయి. బంగ్లాదేశ్‌ 75వ ర్యాంక్‌ కాగా, మయన్మార్‌, పాకిస్తాన్‌లు వరుసగా 78, 88 స్థానాల్లో నిలిచాయి. నేపాల్‌ 73లో, శ్రీలంక 64వ స్థానాల్లో ఉన్నట్లు అంటే ''మధ్యమం'' కేటగిరీల్లో ఉన్నాయని నివేదిక సూచించింది. చైనా, బెలారస్‌, ఉక్రెయిన్‌, టర్కీ, క్యూబా, కువైట్‌ సహా పదిహేడు దేశాలు ఐదుకంటే తక్కువ గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ( జిహెచ్‌ఐ) ర్యాంకులతో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కన్సర్న్‌ వరల్డ్‌, వెల్త్‌ హంగర్‌ హిల్ఫే సంయుక్తంగా విడుదల చేసిన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌, 2020లో 132 దేశాల సమాచారాన్ని సేకరించినప్పటికీ.. 107 దేశాలకు మాత్రమే ర్యాంకులు ఇచ్చారు. సమగ్ర సమాచారం లేకపోవడం వల్ల 25 దేశాలకు ర్యాంక్‌లను లెక్కించడం సాధ్యపడలేదని నివేదికలో వెల్లడించారు.