Nov 18,2020 20:44

కొన్ని లక్షల గ్రామాలున్న మనదేశంలో బహిరంగ మల విసర్జన అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ''బయటకు'' వెళ్లటం అనే మాట ఆ కాలకృత్యానికి ఒక సంకేత సూచకంగా మారిపోయింది. సరైన నివాసాలు లేకపోవటం, నీటి వసతి అందుబాట్లో లేకపోవటం, వీటివల్ల స్థిరపడిన కొన్ని అభిప్రాయాలూ... మరుగుదొడ్ల నిర్మాణానికీ, వినియోగానికీ అవరోధాలవుతున్నాయి. ఈ వాస్తవ పరిస్థితులను గుర్తించకుండా, అవగాహన పెంచకుండా 'స్వచ్ఛభారత్‌' అని నినాదాలివ్వటం వల్ల ఉపయోగం లేదు.

మనదేశంలో అనేకమందికి ఇప్పటికీ మరుగుదొడ్లు అందుబాట్లో లేవు. కమ్యూనిటీ మరుగుదొడ్లు ఎక్కడ ఉన్నా వాటిలో పారిశుధ్య సౌకర్యాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. సాధారణంగా మురికివాడల్లో ఇటువంటి కమ్యూనిటీ మరుగుదొడ్లు కనపడుతుంటాయి. నగరాలు, పట్టణాల్లో కూడా బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆఫీసులు, షాపింగ్‌ కాంప్లెక్సులు వంటి వాటి దగ్గర ఉంటాయి. ఒక నివేదిక ప్రకారం... మన దేశంలో 41 శాతం గృహాలు కమ్యూనిటీ మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నాయి.
అహ్మదాబాద్‌లోని నవరంగపురాలో ఎనిమిది యూనిట్లతో కూడిన ఒక కమ్యూనిటీ టాయిలెట్‌ ఉంది. సమీపంలోని మురికివాడల్లో నివసిస్తున్న 60 కుటుంబాలు వాటిని వినియోగిస్తున్నాయి. ప్రారంభంలో నీటి లభ్యత ఉన్నా ఆ తరువాత లేదు. దీంతో వాటిని ఉపయోగించకుండా వారంతా బహిర్భూమికే వెళుతున్నారు. ఢిల్లీలోని బవానా దగ్గర గల మురికివాడ నివాసితులు ఇప్పటికీ ఒక కర్మాగారానికి నీటిని తీసుకువెళ్ళే కాలువల దగ్గర మల విసర్జన చేస్తున్నారు. జనాభాకు తగినన్ని కమ్యూనిటీ మరుగుదొడ్లు లేకపోవడం లేక ప్రస్తుతం ఉన్న వాటికి నీటి సదుపాయం కల్పించకపోవడం వల్ల ఈవిధమైన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి దేశంలో చాలాచోట్ల ఉంది.
కొరవడిన అవగాహన
పంజాబ్‌లోని లుధియానా జిల్లా మురికివాడల్లో బహిరంగ మలవిసర్జన విస్తఅతంగా జరుగుతోంది. గత ఏడాది నవంబర్‌లో ఒడిఎఫ్‌ (ఉచిత మలవిసర్జన)గా ప్రకటించిన కర్ణాటకలో మైసూరుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దురా గ్రామానికి చెందిన 200 గృహాలు మరుగుదొడ్లు నిర్మించడానికి అధికారిక నిధులు పొందలేకపోయాయి. సొంతఖర్చులతో మరుగుదొడ్లను నిర్మించుకున్నా ప్రభుత్వాలు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. బీహార్‌లో 2018లో ఒడిఎఫ్‌గా ప్రకటించిన మొదటి జిల్లా సీతామార్హిలో, 2019 సెప్టెంబర్‌ 19 నాటికి కనీసం 20 శాతం గృహాల్లో మరుగుదొడ్లు లేవు. చెప్పుకుంటూ పోతే ఈ గణాంకాలు చాంతాడంత ఉంటాయి.
బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు మూడింట రెండొంతుల కుటుంబాలకు ప్రత్యేకమైన స్నానపు గదులు లేవు. అత్యధికమంది గ్రామీణులు బహిరంగ మలవిసర్జనకే ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల క్రితం ఇదే అంశంపై కొంతమంది యువతులు ఎంతోధైర్యంగా పోరాడారు. కోయంబత్తూరు జిల్లా కొట్టారుమీడు విన్సెంట్‌ రోడ్డులో నివసించే 50 మందికి పైగా నూతన వధువులు వారి ఇళ్లల్లో మరుగుదొడ్లు లేని కారణంగా పుట్టింటికి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో 64 కమ్యూనిటీ మరుగుదొడ్లను వెయ్యిమందికి పైగా జనాభా ఉపయోగిస్తున్నారు. అవి కూడా అపరిశుభ్రంగా ఉండేవి. దీంతో చాలామంది బహిరంగ మల విసర్జనకే మొగ్గు చూపేవారు. ఉత్తరాఖండ్‌, ఉత్తరకాశి జిల్లాలో మాల్నా గ్రామ నివాసి రోషాని భండారి (48) తన గ్రామం నుంచి ఒక కి.మీ దూరం నడిచివచ్చి మరీ బహిర్భూమికి వెళుతోంది. ఆమె ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నా దాన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తోంది. 'ఇంట్లో మరుగుదొడ్డి నిర్వహణకు సరిపడా నీరు లేదు. నీటికొరత ఉన్న మా ప్రాంతంలో డబ్బాల్లో, బకెట్లలో నీటిని నిల్వ చేసుకుంటాం. ఆ నీరు మొత్తం కుటుంబానికి సరిపోదు. అందుకే నీరు తక్షణమే అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశంలోనే బహిర్భూమికి వెళ్లడం సులభం' అంటుంది ఆమె. చాలా చోట్ల ఉన్న పరిస్థితి ఇదే!
నిర్వహణ అంతంతమాత్రం
నీటికొరత గల మాల్నా లాంటి గ్రామాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. రాజస్థాన్‌లో ఆ విధంగా ఉపయోగించకుండా పోతున్న మరుగుదొడ్లు అనవసర సామాన్లు భద్రరుచుకోవడానికో, ఇతర పనులకో ఉపయోగిస్తున్నారు. 2011 జనగణన లెక్కల ప్రకారం దేశంలో 69.3 శాతం గ్రామీణ గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. అయితే 2019 జూన్‌ నాటికి 30 రాష్ట్రాల జనాభాకు పూర్తి మరుగుదొడ్ల నిర్మాణం జరిపించినట్లు పాలకులు డప్పాలు కొట్టుకుంటున్నారు. నీటి కొరత లేక వాటిలో ఎన్ని నిరుపయోగంగా మారాయో ఎవరికి ఎరుక
మాటలకే పరిమితమా?
135 కోట్ల జనాభా గల దేశంలో కేవలం ఐదేళ్లలో సగం మందికి మరుగుదొడ్లు కల్పించాలనే లక్ష్యంతో 2014లో 'స్వచ్ఛ భారత్‌' మిషన్‌ ప్రారంభమైంది. '60 నెలల్లో 60 కోట్ల మందికి ఉపయుక్తంగా 110 మిలియన్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేయాలి' అని ప్రకటించిన ప్రధాని మోడీ 2019 అక్టోబరు 2న మహాత్మా గాంధీ 150వ పుట్టినరోజు సందర్భంగా 'ఇంత తక్కువ వ్యవధిలో దేశం యావత్తు బహిరంగ మలవిసర్జన రహితంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కాని ఇది నిజమని నిరూపించాం' అని చెప్పారు. కాని వాస్తవంలో బహిరంగ మలవిసర్జన మన దేశంలో నేటికీ కొనసాగుతోంది. గతేడాది యునిసెఫ్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అంటే దేశంలో 62 కోట్ల మంది జనాభా బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని తేలింది. ఇంటిలోపలి ఆవరణలో మలవిసర్జన చేయడం నేరంగా భావించే వైఖరులు మన దేశంలో ఇప్పటికీ అక్కడక్కడ కనపడతాయి. ఇంటి ఆవరణ పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలనే అనేక గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని పరిశోధనల్లో తేలింది.
డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన అవసరం
దేశవ్యాప్తంగా సమర్థవంతమైన మరుగుదొడ్ల నిర్వహణ చేయాలంటే నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ ప్రాంతాలలో బలమైన పారుదల వ్యవస్థలను సిద్ధం చేయాలి. నేటికీ పట్టణ ప్రాంతాల్లోనే సరైన పారుదల వ్యవస్థ లేదు. శతాబ్దాలుగా, మానవ జనాభా పెరుగుతున్నా అందుకనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థలో మార్పులు లేవు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లోనే డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ అస్తవ్యస్తంగా ఉంటోంది. ఒక మాదిరి వర్షాలకే డ్రైనేజీలు పొంగిపొర్లుతుంటాయి. తగినంత మురుగునీటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ అరక్షిత నీరు నేరుగా నీటి వనరులకు చేరి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. వేగంగా అభివఅద్ధి చెందుతున్న ఈ 'ఆధునిక' నగరాల్లోని పారుదల వ్యవస్థలు చాలా పురాతనమైనవి. పారుదల వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం వల్ల ప్రజల సాధకబాధలతో ప్రమేయం లేకుండా డ్రైనేజీ డిజైన్‌ రూపొందించబడుతోంది. అభివఅద్ధి చెందుతున్న దేశంగా గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం, వారి ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

                                                                                                                                               - జ్యోతిర్మయి