Jan 19,2022 09:13

జెనీవా : కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచంపై విరుచుకుపడుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రాయెసస్‌ హెచ్చరించారు. గత వారంలో సుమారు ప్రపంచ వ్యాప్తంగా 18 మిలియన్ల మంది (కోటి 80 లక్షల మంది) దీని బారిన పడ్డారని తెలిపారు. మరణాల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలుపై తీవ్ర ప్రభావాన్ని చూపి.. ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తుండటంపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని దేశాల్లో, కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయని, ఈ వేవ్‌ అత్యంత చెత్త దశగా ఉందని అన్నారు. ఏ దేశం కూడా దీని బారిన పడకుండా.. బయటకు రాలేదని తెలిపారు. తాను వ్యాక్సినేషన్‌ తక్కువ ఉన్న దేశాల పట్ల ఆందోళన చెందుతున్నానని, టీకాలు తీసుకోకపోవడం వల్ల మహమ్మారి బారిన పడతారని, మరణాల సంఖ్య పెరిగే అవకాశాలుంటాయని టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ తక్కువ తీవ్రత కావచ్చునేమో కానీ, తేలిక పాటి వ్యాధి అనే కథనం తప్పు దారి పట్టించేదని, దీని వల్ల తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొవలసి ఉండేదని, మరిన్ని ప్రాణాలు బలయ్యేవని అన్నారు.