Jun 10,2021 19:49

న్యూఢిల్లీ : ఒక రంగంపై మరొక రంగం పరస్పరంగా ఆధారపడడాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం మరోమారు పునరుద్ఘాటించిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. సమర్థవంతమైన, సుస్థిర సేవలను అందించేందుకు విధానాల విషయంలో రంగాల మధ్య అనుసంధానత ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'హెల్త్‌ అండ్‌ ఎనర్జీ ఫ్లాట్‌ఫాం ఆఫ్‌ యాక్షన్‌'పై బుధవార రాత్రి జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నతస్థాయి కూటమి మొదటి సమావేశంలో హర్షవర్ధన్‌ పాల్గని ప్రసంగించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి పలు దేశాల అధ్యక్షులు, పలువురు ప్రముఖులతోపాటు ప్రపంచబ్యాంక్‌, యుఎన్‌డిపి, యుఎన్‌హెచ్‌ఆర్‌సి, ది ఇంటర్నేషనల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఆర్‌ఇఎన్‌ఎ) వంటి సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, మానవ ఆరోగ్యంపై ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు తమ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని హర్షవర్ధన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాతావరణ సంబంధిత గుర్తించిన వ్యాధులపై హెల్త్‌ యాక్షన్‌ ప్లాన్‌తో సహా ఈ కమిటీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక నివేదికను ఇచ్చిందని తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా తగిన ఆరోగ్య సదుపాయాలను ప్రోత్సహించేందుకు భారత్‌ 2017లో జరిగిన మాలే ఒప్పందంపై సంతకం చేసింది.