Jul 29,2021 23:27

సమీక్షలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మనజీర్‌ జిలాని

- ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మనజీర్‌ జిలాని
ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌:
 ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటి సంరక్షించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా అధికారులతో జలశక్తి అభియాన్‌ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జలశక్తి అభియాన్‌పై ప్రచారం చేసి వర్షపు నీటిని సంరక్షించడం, నీటి వినియోగంలో మెళకువలు పాటించి వృథాను అరికట్టడం, పొదుపు నీటితో నీటి పారుదల విస్తీర్ణం పెంపొందించడం వంటి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామంలో చెరువులు, కుంటలు, వాగులు పక్కన మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా.. ఆ నీటిని ఒడిసి పట్టుకోవాలని జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. పొలంలో పడిన నీరు పంటకుంటల ద్వారా భూమిలోకి ఇంకిపోయేలా చూడాలన్నారు. పొలం సరిహద్దు వెంబడి రీచార్జి ట్రెంచులు ఏర్పాటు చేసి ఆ నీరు భూమిలోకి ఇంకిపోయేలా పనులను వేగవంతం చేయాలన్నారు. చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయడం, పూడిక తీయడం, వంకలు, వాగులు, గట్లకు ఇరువైపులా.. పండ్లతోటలు, సామాజిక మొక్కలు పెంచడం, బోరుబావులు రీచార్జి చేయడం, వధానీటిని తిరిగి వాడడం లేదా.. రీచార్జి చేసి భూగర్భజలాలు పెంపొందించేందుకు దోహదం పడడం, చెక్‌డ్యాంలు, పర్కులేషన్‌ ట్యాంకులు, రాక్‌ఫిల్‌ డ్యాంలు, కొండల చుట్టూ కందకాలు నిర్మించి నీటిని సంరక్షిస్తే భూగర్భజలాలు పెంపొందుతాయన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి భూమిలో తేమ శాతాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా పిడి అమర్నాథ్‌ రెడ్డి, జడ్‌పి సిఇఒ వెంకటసుబ్బయ్య, ఇరిగేషన్‌ ఎస్‌ఇ రామచంద్రమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.