May 17,2022 22:20

మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి - ఆమదాలవలస: జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఆమదాలవలస నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజవర్గంలో జన జీవన్‌ మిషన్‌ ద్వారా జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 275 గ్రామాలకు 221 గ్రామాలు టెండర్లు పూర్తిచేసుకొని పనులు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. 20గ్రామాల్లో ఇంటింటికి మంచి నీటి కుళాయి పనులు పూర్తి చేసుకొని ప్రారంభ దశలో ఉన్నాయన్నారు మండలంలో బెలమం, లోద్దలపేట గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు తెలియజేశారు. ఆమదాలవలస మండలంలో 51 గ్రామాలకు, బూర్జ మండలంలో 77 గ్రామాలకు నారాయణపురం నుండి మంచి నీటిని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా అందించేందుకు రూ.వంద కోట్లతో ప్రతిపాదలు పంపామన్నారు. పొందూరు మండలంలో రూ.60 కోట్లతో 75 గ్రామాలకు గండ్రేడు నుండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. సరుబుజ్జిలి మండలంలో రూ.60 కోట్లతో 75 గ్రామాలకు సంబందించి తెలిగి పెంట వద్ద ఉన్న కెనాల్‌ నుండి మంచి నీటిని లిఫ్ట్‌ ఇరిగేసన్‌ ద్వారా అందించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని మాట్లాడుతూ సిఎం జన జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీటిని అందించాలనే దఢ సంకల్పంతో ఉన్నారని ఆయన అన్నారు. జగన్‌ తన పాదయాత్రలో ఎందరో మహిళలు మంచినీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. పనులు వేగవంతం చేయాలని ఇంటింటికీ మంచి నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఇ పి.సూర్యనారాయణ, డిఇఇ లలితకుమారి, జెఇఇ అబ్బాస్‌, మౌళి, పూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.