Jan 31,2023 21:06

 విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి సమర యాత్రలో నేతల స్పష్టం
 కేశవరావు హైస్కూల్లో బహిరంగ సభకు పెద్దసంఖ్యలో హాజరైన విద్యార్థులు, యువత
 ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం: ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌
 భవిష్యత్తు ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం
 ప్రశ్నించకపోతే భవిష్యత్తు అంథకారం: ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌కుమార్‌
 భీమవరం వేదికగా ఉద్యమాలకు శ్రీకారం: డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రాము
ప్రజాశక్తి - భీమవరం
'పార్లమెంటులో చట్టం చేశారు.. తిరుపతి వెంకన్న సాక్షిగా హామీలు గుప్పించారు.. ఎనిమిదిన్నరేళ్లు గడుస్తున్నప్పటికీ ఏఒక్కటీ అమలు చేయలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మరో స్వాతంత్రోద్యమానికి సన్నద్ధమవుతామని విద్యార్థి యువజన సంఘాలు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సమర యాత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై నోరు మెదపకుండా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, మన్యంవీరుడు అల్లూరి స్ఫూర్తితో లక్ష్యాన్ని సాధిస్తామని ప్రతినబునారు. ఈ నెల 25న హిందూపురంలో ప్రారంభమైన సమర యాత్ర 2.0 మంగళవారం జిల్లాలో ప్రవేశించింది. ఆకివీడు వద్ద ఈ యాత్రకు ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఈ యాత్ర బైక్‌ ర్యాలీతో ఉండి మీదుగా జిల్లా కేంద్రమైన భీమవరం చేరుకుంది. కొత్త బస్టాండ్‌ సెంటర్లో ఉన్న కేశవరావు హైస్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ధనుష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేతలు అభివాదం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని, విశ్వవిద్యాలయాలు స్థాపించాలని, ఆక్వా యూనివర్సిటీ పనులు ప్రారంభించాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపాలని నినదించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ కోసం పోరాడుతున్న ఈ యాత్రకు అన్ని రాజకీయ పార్టీలూ కలిసి రావాలన్నారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుంచి కర్కశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్లో చట్టం చేసి, వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి ఇప్పుడు కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు అల్లూరి స్ఫూర్తితో పోరాడతామని హెచ్చరించారు. గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం ఎంఎల్‌ఎ కాకముందు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని తనతోపాటు ఉద్యమించారని, అధికారం చేపట్టాక ఆయన, ఆయన పార్టీ మళ్లీ కన్పించలేదని విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ వచ్చి ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలని చెప్పడమే తప్ప బిజెపిని ప్రశ్నించలేదని ఆరోపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవ సూచిక విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఈ యాత్ర, భవిష్యత్తు ఉద్యమాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతను చూసి ప్రభుత్వ పాలకులు సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగం లేకపోతే భవిష్యత్తు విద్యార్థి, యువతకు ఉద్యోగాలు ఉండవన్నారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు మోడీతో జతకట్టి మౌనం పాటిస్తున్నాడన్నారు. మోడీని చూడగానే జగన్‌, చంద్రబాబులకు ఒళ్లు చల్లబడి పోతుందని, పవన్‌కు ఒళ్లు పులకరించిపోతుందని వ్యాఖ్యానించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం పాదయాత్ర చేస్తుంటే తాము రాష్ట్ర భవిష్యత్తు కోసం సమర యాత్ర చేస్తున్నామన్నారు. ఇటీవల దర్శిలో 22 ఏళ్ల ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకపోతే భీమవరం కేంద్రంగా ఉద్యమాలకు శ్రీకారం చూడటమని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టి అప్పుడు కాంగ్రెస్‌, ఇప్పుడు బిజెపి తీవ్ర ద్రోహం చేశాయన్నారు. అల్లూరి జయంతి వేడుకకు భీమవరం వచ్చిన మోడీ హోదా, విభజన హామీలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమయ్యాయన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ పార్లమెంట్‌ సాక్షిగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన విభజన హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు ఐక్య ఉద్యమాలు చేపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌, సామాజిక ఉద్యమకారిణి మనోహరమ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కోకన్వీనర్‌ సిహెచ్‌.పావని, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.వాసు, డి.పెద్దిరాజు, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి అప్పలస్వామి, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు రాజేష్‌, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌విఎన్‌.శర్మ, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి.ప్రసాద్‌, వి.భాను, గర్ల్స్‌ కన్వీనర్‌ పి.మోహిని పాల్గొన్నారు.