Jul 03,2022 22:18

అల్లూరి జయంతి సభలో వామపక్షాలు డిమాండ్‌

ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
సోమవారం భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రధాని మోడీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. తిరుపతి యశోదానగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం అధ్యక్షతన అల్లూరి జయంతి సభ జరిగింది. ఆర్‌పిఐ రాష్ట్ర అద్యక్షులు పి.అంజయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ నగర కార్యదర్శి జె.విశ్వనాధ్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు, బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వీరుడని కొనియాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన నరేంద్రమోడీ అల్లూరికి వారసులమని చెప్పుకోడానికి అర్హత లేదన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజన హక్కుల కోసం, అటవీ హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన జాతులపై అణచివేత, అటవీ హక్కులను కాలరాయడం వంటి దుర్మార్గమైన చర్యలకు పూనుకుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అణచివేత చర్యలకు వ్యతిరేకంగా, నిర్బంధానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాటాలను కొన సాగించాలన్నారు. జులై నాలుగో తేదీ భీమవరానికి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్న నరేంద్రమోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి, జిల్లా కమిటి సభ్యులు ఎస్‌.జయచంద్ర, పి.సాయిలక్ష్మి, నగర నాయకులు లక్ష్మి, బుజ్జి, వేణు, చిన్నా, నరేంద్ర, మల్లికార్జునరావు, రాధాక్రిష్ణ, ఎన్‌డి శ్రీనివాసులు, మోహన్‌రావు, జయంతి, రవి, అక్బర్‌, అశోక్‌ పాల్గొన్నారు.
అల్లూరి అడుగుజాడల్లో నడుద్దాం : యండపల్లి
స్వాతంత్య్ర సంగ్రామ విప్లవ వీరుడు అల్లూరి సీతా రామరాజు అడుగుజాడల్లో నడచి పాలకుల నియంతృత్వ పోకడలకు ఎదురొడ్డి నిలవాలని ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం యుటిఎఫ్‌ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీతారామరాజు తన పోరాటంలో భాగంగా అన్ని వర్గాలను చైతన్యపరిచాడని, బ్రిటీష్‌వారి నుంచి భారతదేశ వాసులకు విముక్తి కలిగించడానికి పోరాడి మన్నెం వీరుడుగా గుర్తింపు పొందాడన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌ నాయుడు, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి ముత్యాలరెడ్డి, నాయకులు సదాశివరెడ్డి, దండు రామచంద్రయ్య, బండి మధు, సురేష్‌, నిర్మల, పద్మజ, సునీల పాల్గొన్నారు.