May 05,2021 00:49

ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాల ద్వారానికి క్లోజ్డ్‌ బోర్డు అతికించిన సిబ్బంది

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ
రాష్ట్రంలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో నడిచే జంతు ప్రదర్శన శాలలు, నగర వనాలు, ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్‌ ఎకో పార్క్‌లను బుధవారం నుంచి మూసివేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి, వన్యప్రాణి విభాగం ముఖ్య సంరక్షణాధికారి ఎన్‌.ప్రతీప్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కోవిడ్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో మనుషుల, జంతువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విశాఖపట్నంలోని నెహ్రూ జులాజికల్‌ పార్క్‌, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్‌ పార్క్‌లతో పాటు రాష్ట్రంలోని 29 ఎకో టూరిజం సెంటర్లు, 23 నగర వనాలు, 7 టెంపుల్‌ ఎకో పార్కులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా ప్రాంతాలలో కన్జర్వేటర్లు, డిఎఫ్‌ఒలు జంతువుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూలో ఉన్న జంతువులకు సంబంధించి సెంట్రల్‌ జూ అథారిటీ ఇచ్చిన సూచనలను విధిగా పాటించాలని పేర్కొన్నారు.