May 09,2021 12:38

కొబ్బరి, తాటి, ఈత, ఖర్జూరం, వక్క వంటి మొక్కలన్నీ కూడా పామే జాతికి చెందిన మొక్కలు. వీటిని పామ్స్‌ అంటారు. ఇవి పామ్‌ (అరిచేయి) ఆకారంలో ఉంటాయి. ఇవున్న ప్రదేశాల్లో ఎంతో శోభనింపుతాయి. ఈ మొక్కలు ఎక్కడుంటే అక్కడ అందం, ఆకర్షణ. కొన్ని మధురమైన ఫలాలందించగా, మరికొన్ని కల్లు (ద్రావణం) ఇస్తాయి. ఆర్నమెంటల్‌గానూ ఇవి ఫేమస్‌. వీటిలో వందల రకాలున్నాయి. కుండీల్లో పెరిగే చిన్న రకాల పామ్స్‌, పెద్ద వృక్షాలుగా పెరిగే టాల్‌ వెరైటీ వీటిలో ఉన్నాయి. సాధారణంగా ఇవి ఏక కాండం ఉంటుంది. ఆకులు దళసరిగా బలంగా ఉంటాయి. నీటి కొరతను తట్టుకుని పెరుగుతాయి. రోడ్లకు ఇరువైపులా, మధ్యన డివైడర్లలో, ఇంటి ముంగిట, పార్కుల్లోను, హౌటల్స్‌, అతిథి గృహాల వద్ద పామ్స్‌ మొక్కలు పెంచుతారు.

పర్యాటక శోభనద్దే పామ్‌ మొక్కలు


                                                              ఫాక్స్‌ టైల్‌ పామ్‌

   అందమైన పామ్స్‌ మొక్కల్లో ఫాక్స్‌ టైల్‌ పామ్‌ ఒకటి. చెట్టు పది మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. కాండం లేత సిమ్మెంటు రంగులో స్తంభంలా భలే అందంగా ఉంటుంది. ఆకులు రెండు నుంచి మూడు మీటర్లు పొడవు ఉంటాయి. ఆకులు నక్క తోకను పోలి ఉండటంతో ఈ చెట్టును ఫాక్స్‌ టైల్‌ పామ్‌ అని పిలుస్తారు. వీటి కాయలు బాతుగుడ్డు పరిమాణంలో నారింజపండు రంగులో ఉంటాయి. మొక్క నాటిన ఎనిమిదేళ్లకు కాయలు కాస్తుంది. గుత్తులు గుత్తులుగా కొబ్బరి పిందెలు మాదిరిగా ఉండే ఫాక్స్‌ టైల్‌ కాయలు చెట్టునుంటే ఎంతో అందం. ఈ కాయలు విత్తనాలుగా ఉపయోగపడతాయి. 1970కి పూర్వం ఈమొక్క గురించి పెద్దగా తెలియదు. ఆస్ట్రేలియన్‌ అడవుల్లోంచి ఆదిమ జాతికి చెందిన ఒడియేటి అనేతను వృక్ష నిపుణులకు చూపించాడు. అప్పటి నుంచి ఈ మొక్క ప్రపంచానికి పరిచయమైంది. అందుకే ఈ మొక్కను ఆస్ట్రేలియాలో ఒడియేటియా అని పిలుస్తారు.

                                                         బిస్మార్కియా నోబ్లిష్‌

   చూడ్డానికి అచ్చంగా తాటి చెట్టు మాదిరిగానే ఉంటుంది. ఆకులు తటాకులకంటే పెద్దవిగా ఉంటాయి. తాటి చెట్టుతో పోలిస్తే చెట్టు పొట్టిగా ఉంటుంది. ఆకులు సిల్వర్‌ రంగులో ఉంటాయి. అందుకే దీన్ని బిస్మార్కియా సిల్వర్‌ అని కూడా పిలుస్తారు. చెట్టు చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇది వెడల్పు ఆరేడు మీటర్ల వ్యాసం వరకూ విస్తరిస్తుంది. తొలుత ఈ జాతి మొక్కలు మడ్‌ గాస్కర్‌ ప్రాంతంలో ఉండేవి. ఎంత నీరందించినా చక్కగా తీసుకుంటాయి. ఆకుపచ్చని ల్యాండ్స్కెపుల్లో మధ్యలో వీటిని నాటితే వెండి మెరుపులు కురిపిస్తుంది. ఆకుల మట్టలకు రంపాల్లాంటి రక్షక తంత్రాలుంటాయి.

పర్యాటక శోభనద్దే పామ్‌ మొక్కలు

                                                                      

                                                                   ఫిష్‌ టైల్‌ పామ్‌

   ఫిష్‌ టైల్‌ పామ్‌ మరో అపురూపమైన మొక్క. ఆకులు చివర భాగాన చేప తోక పొలుండటంతో ఫిష్‌ టైల్‌ పామ్‌ అని పిలుస్తారు. వాస్తవానికి దీని పేరు కార్యోట పామ్‌. ఇది కూడా ఫాక్స్‌ టైల్‌ పామ్‌లా పెరుగుతుంది. ఆకుల నిర్మాణం మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఆసియా దేశాల్లో ఈ మొక్క విరిగిగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో కూడా ఉంటుంది. మొక్క పదేళ్లు పెరిగిన తరువాత దానికి గెల వస్తుంది. గెలకు వందల సంఖ్యలో గొలుసులాంటి ఈసులు వస్తాయి. కొందరు ఈ పువ్వు కత్తిరించి పానీయం (కల్లు) సేకరిస్తారు. ఇది బెల్లపు ఊట స్వభావాన్ని కలిగి మత్తునిస్తుంది. ఏజెన్సీ వాసులు దీనిని జీలుగ కల్లు అంటారు. ఈ మొక్క ఎక్కడ నాటినా ఎంతో శోభనిస్తుంది.

                                                               రాయల్‌ పామ్‌

   రాయల్‌ పామ్‌ చెట్టు 60 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. చెట్టు కాండం గుండ్రంగా స్తంభంలా నున్నగా ఉంటుంది. ఆకులు కొబ్బరాకులను పోలి గుజ్జుగా ఉంటాయి. క్యూబా పరిసర ప్రాంతాలనుంచి ప్రపంచమంతా వ్యాపించిన మొక్క ఇది. సముద్ర తీర ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. రాయల్‌ పామ్‌ను క్యూబాలో కలపగా, పెరూలో ఆకును కషాయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. నాడీ వ్యవస్థ, మానసిక ఆరోగ్యానికి, జీర్ణ సంబంధిత వ్యాధులు, పశువుల మందుల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. పార్కులు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఎలివేషన్‌ భవనాలు ముందు ఇవి వీటిని నాటుతారు.

                                                                           అరేకా పామ్‌

అరేకా పామ్‌

   అందమైన పొట్టి పామ్‌ మొక్క అరేకా పామ్‌. ఇది నీడ ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. ఈతాకుల్లాంటి ఆకులు మొక్క కుదుల్లోంచి వస్తాయి. ఆకులు ప్లెక్స్‌ బుల్‌గా మెత్తగా ఉంటాయి. ఆకులు ఎంతో అందంగా ఉంటాయి. కుండీల్లోనూ, నేలమీదా బానే పెరుగుతాయి. సమాన నీటి వనరు అవసరం. రెండడుగులు నుంచి ఆరడుగుల ఎత్తువరకూ పెరుగుతాయి. బెడ్‌ రూముల్లో, హాళ్లలో, పెరట్లో ప్రహారీ గోడల పక్కన నాటి పెంచుకోవచ్చు. ఎన్ని ఎక్కువ ఆకులుంటే మొక్కంత గిరాకీ.

                                                                        విసినికర్ర పామ్‌

 విసినికర్ర పామ్‌

   చిన్న చిన్న తాటాకుల్లా అందంగా ఉండే ఈ పామ్‌ని వాడుకలో విసినికర్ర మొక్క అంటాం. లికులా గ్రాండిస్‌, రఫ్ఫ్డ్‌ ఫ్యాన్‌ పామ్‌, వనాటు ఫ్యాన్‌ పామ్‌ లేదా పలాస్‌ పామ్‌ ఇవన్నీ దీని దగ్గర జాతి మొక్కలు. పసిఫిక్‌లోని ఒక ద్వీప దేశమైన వనాటుకు చెందిన అరెకాసియే కుటుంబానికి చెందిన మొక్కలివి. రెండు నుంచి ఐదడుగుల ఎత్తువరకూ మొక్కలు పెరుగుతాయి. ఆకులు చాలా అందంగా ఉండి నెలల తరబడి అలరిస్తాయి. కుండీల్లో పెంచుకోవచ్చు. ఇంటా బైటా పెంచొచ్చు.

                                                           ఛాంపియన్‌ పామ్‌

   ఇదో విలక్షణమైన మొక్క. మొక్క ఎన్నళ్లయినా పొట్టిగానే ఉంటుంది. పదడుగులు మించి పెరగదు. ఆకులు కొబ్బరాకుల్లా ఉండి చిన్న సైజులో ఉంటాయి. మొక్కకు ఆకులు ఒక క్రమంలో కాకుండా ఎగుడు దిగుడుగా ఉంటాయి. అదే ఈ మొక్క స్టైల్‌. దీని కాండ సీసా ఆకారంలో భలే గమ్మత్తుగా ఉంటుంది. అందుకే దీన్ని బాటిల్‌ పామ్‌ అని కూడా పిలుస్తారు. ఇది పూర్తిగా ఔట్‌ డోర్‌ మొక్క. ఈ ఛాంపియన్‌ పామ్‌ ఎక్కడున్నా అందమే.

                                                        ఎలిఫెంట్‌ ఫూట్‌ పామ్‌

 ఈ మొక్క కాండం మొదలు అచ్చంగా ఏనుగు పాదంలా ఉంటుంది. ఆకులు అంగుళం వెడల్పుతో సన్నటి చివరలతో అడుగు నుంచి మూడడుగుల పొడవుంటాయి. జుత్తు విరబూసినట్లు ఆకులు ఉండి ప్రత్యేకతను చాటుతాయి. విశాల ప్రాంతాల్లో పచ్చిక బైళ్ల మధ్య ఈ మొక్క ఎంతో అందం.
 

- చిలుకూరి శ్రీనివాసరావు