Nov 21,2020 21:07

కర్నూలు ప్రతినిధి: తుంగభద్ర పుష్కరాల్లో రెండో రోజు శనివారం పర్యాటకుల తాకిడి నామమాత్రంగానే ఉంది. కోవిడ్‌ నేపథ్యంలో నదీ స్నానాలకు అనుమతిలేకపోవడంతో పర్యాటకుల్లో అసంతృప్తి నెలకొంది. తుంగభద్ర నదీ తీరంలో జిల్లా వ్యాప్తంగా 23 పుష్కర ఘాట్లను ఏర్పాట్లు చేశారు. వాటిలో పుష్కర స్నానాలను ఆచరించేందుకు షవర్లను ఏర్పాటు చేసి జల్లు స్నానాలకు అనుమతించారు. నదిలోకి దిగకుండానే ఘాట్ల సమీపంలో పిండిపదానాలు చేసేందుకు అవకాశం కల్పించారు. మంత్రాలయంలోని రుద్రభూమి ఘాట్‌ వద్ద నిర్మాణపు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తపల్లి మండలం సంగమేశ్వరానికి వెళ్లే పర్యాటకుల కోసం కపిలేశ్వరం వద్ద ఎర్ర మఠం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మాస్కులు, శానిటైజర్లు అరకొరగానే ఉన్నాయి. పుష్కరాల రెండో రోజు దాదాపు 8వేల మంది పాల్గన్నట్టు అంచనా. మంత్రాలయం నియోజకవర్గంలోని పుష్కర ఘాట్లలోనే కాస్త సందడి వాతావరణం కనిపించింది. కర్నూలు సమీపంలోని మునగాలపాడు, ఓల్డ్‌ పంప్‌ హౌస్‌ పుష్కర ఘాట్లను కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, ఎస్‌పి ఫక్కీరప్ప, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ డికె.బాలాజీ సందర్శించారు. ఘాట్లల్లో నీటి మట్టాన్ని పెంచాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో పే అండ్‌ ఈట్‌ ఫుడ్‌ కౌంటర్లను ఏర్పాటు చేయించి ప్యాకెట్ల రూపంలో ఆహారాన్ని అందించాలని డిఆర్‌డిఎ, మెప్మా పిడిలను ఆదేశించారు.