
ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్ : లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారంపోతురాజు కాలువ కట్ట పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం 120 మైక్రాన్ల కన్న తక్కువ సామర్ధ్యం ఉన్న ప్లాస్టిక్ కవర్లను రద్దు చేసినట్లు తెలిపారు. అలాంటి కవర్లను ఎవరై అమ్మినా, కొనినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతోందని వివరించారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ భాగంగా ప్రజలు తమ వ్యక్తిగత జీవనశైలిలో మార్పులు తెచ్చుకోవాలన్నారు. అనంతరం ప్రజల చేత మిషన్ లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ప్రతిజ్ణ చేయించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ మనోహర్‌రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ ఎన్.పిచ్చయ్య, స్థానిక కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
సచివాలయంలో తనిఖీ
స్థానిక తూర్పు క్రిష్టియన్ పాలెం సచివాలయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది హాజరు పట్టి, మూమెంట్ రిజిస్టర్‌ను పరిశీలిం చారు. రిజిస్టర్‌లు సక్రమంగా వినియోగించడంలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించాలని సూచించారు. సచివాలయ పరిధిలో జరుగుతున్న వివిధ రకాల సర్వేలను వేగవంతం చేయాలని సూచించారు.