Apr 08,2021 07:14


దక్షిణ బెంగాల్‌లో పట్టు నిలుపుకోవడం కోసం మమత బెనర్జీ ఒక వైపు పడరాని పాట్లు పడుతుంటే, మరో వైపు తృణమూల్‌ కోటను బద్దలు కొట్టి అక్కడ పాగా వేయాలని బిజెపి ఆరాటపడుతోంది. ఇంకో వైపు వీరిరువురికి చెక్‌ పెట్టేందుకు సంయుక్త మోర్చా శక్తి వంచన లేకుండా పోరాడుతోంది.
ఎనిమిది విడతలుగా జరుగుతున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మూడవ,నాల్గవ, అయిదవ విడత పోరు తృణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రాణ సంకటంగా మారింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 120 స్థానాలు ఈ మూడు విడతల పోలింగ్‌లో ఉన్నాయి. ఇందులో మూడవ విడత ఇప్పటికే అయిపోయింది. మిగతా నాలుగు, అయిదవ విడతలు ఈ నెల 10, 17 తేదీల్లో వరుసగా జరగనున్నాయి. ఈ మూడు విడతల్లో ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ జిల్లాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను ఇక్కడ తన పట్టు కోల్పోకూడదన్న దాంతో ముఖ్యమంత్రి మమత బెనర్జీ యత్నిస్తున్నారు. దీనిని ఎలాగైనా ఛేదించాలని బిజెపి యత్నిస్తుంటే, కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు సంయుక్త మోర్చా (లెఫ్ట్‌, కాంగ్రెస్‌, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎప్‌) కూటమి) నడుం బిగించింది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బిజెపి దక్షిణ బెంగాల్‌లో తృణమూల్‌ కోటలను బద్దలు కొట్టడంపైన, అలాగే ఉత్తర బెంగాల్‌పై పట్టు సాధించడం కోసం యత్నిస్తోంది. అయితే, అది అంత తేలికేమీ కాకపోవచ్చు. అభ్యర్థుల ఎంపిక సందర్భంగా తలెత్తిన ముఠా తగాదాలు ఇప్పుడా పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేలా ఉన్నాయి. మొత్తం 80 స్థానాలు ఉన్న ఉత్తర 24 పరగణాలు (33 సీట్లు), దక్షిణ పరగణాలు(31), హౌరా (16) జిల్లాల్లో 2016 ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తిరుగులేని ఆధిక్యత కనబరచింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా దూసుకొచ్చిన స్థితిలో సైతం మమత ఇక్కడ తన పట్టును నిలుపుకోగలిగింది. ఉత్తర 24పరగణాల్లో 21 అసెంబ్లీ సెగ్మెంట్లలోను, దక్షిణ 24 పరగణాల్లో 31 సెగ్మెంట్లలోను, హౌరాలో 15 సెగ్మెంట్లలోను తృణమూల్‌ ఆధిక్యత సాధించింది. ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తుండడం, ఇతరత్రా కారణాల రీత్యా తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఈ మూడు జిల్లాల్లో గట్టి పోటీ ఎదురవుతోంది. ఆ పార్టీకి చెందిన స్థానికంగా పట్టు ఉన్న నాయకుల్లో చాలా మంది బిజెపిలోకి ఫిరాయించడంతో దాని నిర్మాణం ఆ మేరకు బలహీనపడింది. దీనికి తోడు అంఫన్‌ తుపాను సహాయం పంపిణీలో అక్రమాలు, కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో రేషన్‌ పంపిణీలో అవకతవకలు, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో అసమర్థ నిర్వాకం ఇవన్నీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను మరింత పెంచాయి. ఇవి తమ విజయావకాశాలను దెబ్బతీసేలా ఉన్నాయన్న భయం ఆ పార్టీ నాయకులను కలవరపెడుతున్నది.

పశ్చిమ బెంగాల్‌లో ఆట మారుతోంది
సంయుక్త మోర్చా, ముస్లిం ఓట్లు
ఈ పరిస్థితుల్లో మైనార్టీ ముస్లింల మద్దతును నిలబెట్టుకోవడం కోసం మమత వేయని ఎత్తు లేదు. మరో వైపు సమాజంలో మత పరమైన చీలిక తీసుకొచ్చేందుకు బిజెపి తన విచ్ఛిన్నకర ఎజెండాతో ముందుకెళ్తోంది. ఈ మత సమీకరణలు, విచ్చల విడిగా డబ్బు వెదజల్లి 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలను సాధించిన బిజెపి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనే అటువంటి ట్రిక్కులే ప్రయోగిస్తోంది.
బెంగాల్‌లో 27 శాతం దాకా వున్న ముస్లింలు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారనేది కీలకమైన అంశం. ముస్లింలు రాష్ట్రంలో అంతటా కాకున్నా 74 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో 40 శాతం దాకా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ డెబ్బయి నాలుగు స్థానాల్లో అరవై స్థానాలు గత సారి తృణమూల్‌ ఖాతాలో పడ్డాయి. ఈసారి ఆ పరిస్థితి లేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో తమకు చేసిందేమీ లేదన్న అసంతృప్తి మైనార్టీల్లో గూడుకట్టుకుని ఉండడం, ముస్లింలలో ప్రజాకర్షక నేతగా గుర్తింపు ఉన్న అబ్బాస్‌ సిద్ధిఖీ నేతృత్వంలోని ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) సంయుక్త మోర్చాలో భాగస్వామిగా ఉండడం మమతకు ఈ సెక్షన్‌ నుంచి పెద్దగా మద్దతు లభించకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్‌ అందరూ పోరాడారు కాబట్టి ఈ అంశంలో తృణమూల్‌కు పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండకపోవచ్చు.
మరో వైపు బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన మతువా (హిందూ మతానికి చెందిన తెగ) కమ్యూనిటీని తన బుట్టలో వేసుకునేందుకు బిజెపి ఒక పథకం ప్రకారం యత్నిస్తోంది.తాము అధికారంలోకి వస్తే మతువా దళపతులకు నెలకు రూ.3వేలు స్టయిపెండ్‌ ఇచ్చే నిర్ణయాన్ని తొలి కేబినెట్‌ సమావేశంలోనే తీసుకుంటామని బిజెపి ప్రకటించడం, మతువా తెగ వ్యవస్థాపకుని జన్మస్థలమైన ఒరాకండిని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బంగ్లాదేశ్‌ పర్యటన సందర్భంగా పనిగట్టుకుని వెళ్లి సందర్శించడం వంటివి చేసింది. వాస్తవానికి 2019 ఎన్నికలప్పుడే మతువా తెగ ఓటర్లలో ఒక పెద్ద సెక్షన్‌ను బిజెపి తన వైపు తిప్పుకుంది.
బిజెపిలో కుమ్ములాటలు
ప్రభుత్వ వ్యతిరేకత, పెద్దయెత్తున ఫిరాయింపులతో తృణమూల్‌ కాంగ్రెస్‌ సంస్థాగతంగా బలహీనపడడం వంటివి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న బిజెపికి సొంత పార్టీలో కుమ్ములాటలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. పార్టీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర వ్యాపితంగా ఆ పార్టీలో అసమ్మతి రాజుకుంది. గత కొద్ది మాసాల్లో తృణమూల్‌ నుంచి 30 మంది దాకా నాయకులు ఫిరాయిస్తే, వారందరికీ బిజెపి పార్టీ టికెట్లు ఇచ్చి బరిలోకి దింపింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేసిన తమను పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన కళంకితులైన వ్యక్తులకు పార్టీ టికెట్లు ఇస్తారా అంటూ సీనియర్లు పార్టీ నాయకత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. నిజాయితీగా పనిచేసేవారికి పార్టీలో గుర్తింపు లేదని, కుట్రదారులకు, మీర్జాఫర్లకు పెద్దపీట వేస్తోందని సీనియర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులపై దాడులకు దిగారు. బిజెపి ఓడిపోవడం తథ్యం అంటూ శాపనార్థాలు పెట్టారు. ఒకరిద్దరు అభ్యర్థులు తాము బిజెపిలో సభ్యులం కాదంటూ పార్టీ టికెట్‌పై పోటీ చేయడానికి తిరస్కరించారు. నాలుగు చోట్ల ప్రస్తుత ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపడం బిజెపి బలహీనతను తెలియజేస్తోంది. దీనికి భిన్నంగా లెఫ్ట్‌, కాంగ్రెస్‌, ఐఎస్‌ఎఫ్‌ కూటమి అభ్యర్థుల ఎంపిక సాఫీగా సాగిపోవడం గమనార్హం. ఏదేమైనప్పటికీ బిజెపి 2019 ఎన్నికల్లో సాధించిన విజయాలను ఈసారి నిలబెట్టుకుంటుందా అన్నది సందేహమే.
                                                                                                                 (ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌)