Oct 03,2022 22:21

నేడు వెంకట్రామన్నగూడెం నుంచి ప్రారంభం
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం రూరల్‌

              అమరావతి మహాపాదయాత్ర సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడెం వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. వెంకట్రామన్నగూడెం హార్టీకల్చరల్‌ యూనివర్సిటీ వద్ద టిడిపి నియోజవకర్గ కన్వీనర్‌ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నాయకులు మహా పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిడిపి కన్వీనర్‌ వలవల బాబ్జీ మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానికి ప్రకటించాలని రైతులు చేస్తున్న పాదయాత్రకు నియోజకవర్గంలో జనసేన, బిజెపి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు ప్రకటించాయని తెలిపారు. వీరి సహకారంతో నియోజకవర్గంలో రైతుల మహా పాదయాత్రను ఘనంగా నిర్వహిస్తామన్నారు. వెంకట్రామన్నగూడెం చేరుకున్న రైతుల మహా పాదయాత్ర సభ్యులు పెదతాడేపల్లి శివారు జాతీయ రహదారి పక్కనే ఉన్న కమ్మ కళ్యాణమండపంలో బస చేశారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు వెంకట్రామన్నగూడెం హార్టీకల్చరల్‌ యూనివర్సిటీ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పెదతాడేపల్లి మీదుగా తాడేపల్లిగూడెం పట్టణంలోని మాగంటి కళ్యాణ మండపం వరకు సాగి మధ్యాహ్నం భోజనం విరామానికి ఆగుతారు. అనంతరం బస్టాండ్‌, తాలూకాఫీస్‌ సెంటర్‌, పోలీస్‌ ఐలాండ్‌, మార్కెట్‌ మీదుగా సాగి సాయంత్రానికి మండల కేంద్రమైన పెంటపాడు ఎస్‌టివిఎన్‌ పాఠశాలకు చేరుకుంటుంది. రాత్రికి రైతులు అక్కడే బస చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు, టిడిపి తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకులు పరిమి రవికుమార్‌, మద్దిపాటి ధర్మేంద్ర, రామ లకëణ్‌, గంథం సతీష్‌, పాతూరి రామ్‌ ప్రసాద్‌చౌదరి, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.