Jan 11,2021 19:10

పడిపడి లేచే అలలు
పసివాడి నడకలు
వడివడిగా అడుగులు
తీరం వెంబడి పరుగులు
అలసట తెలియని బాల్యం
మదిలో నిలిచింది గమ్యం...!!

ఆటుపోట్లు తెలియని మనసు
మాటలు రాని మౌన మునిలా
ఆనంద పారవశ్యంతో
ఘోషను అమ్మ పాటల వింటూ
గోరుముద్ద కై ఎదురు చూసే..!!

ఆశల గాలం తెలియదు
ముత్యపు చిప్పల ఆట తప్ప
ఇసుక గుడుల అందం
అలల తాకిడి పోతే
చిన్న మనసు గాయం
కాళ్లకు నీళ్లు తాకితే మాయం..!!

రాకాసి అలలు చూసి
రాత్రంతా ఏడ్చాను
క్షీరసాగరంలా
అమ్మ అమృతాన్ని పంచితే
పొత్తిళ్లలో కమ్మగా నిద్ర పోయాను..!!
- కొప్పుల ప్రసాద్‌
98850 66235