
ప్రజాశక్తి-పిట్టలవాని పాలెం: పశువులకు గాలికుంటు టీకాలు తప్పకుండా వేయించాలని మంతెన వారిపాలెం పశు వైద్యాధికారి కాటూరి తిరుమల తేజ అన్నారు. సోమవారం మంతెన వారిపాలెం గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువులకు గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. దీని వలన పశువులలో పాల సామర్ధ్యం తగ్గుతుందని అన్నారు. సూడి కట్టటం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఎద్దులకు అయితే బండి లాగే సామర్థ్యం పూర్తిగా తగ్గుతుందని అన్నారు. పశువులకు ఈ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా గాలికుంటు నివారణ టీకాలు వేసే కార్యక్రమం చేపడుతున్నాం అన్నారు. ఈ టీకాలు ప్రతి ఒక్క పశువుకి ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు. నాలుగు నెలల దూడలకు కూడా టీకాలు వేయొచ్చని అన్నారు. ఈ కార్యక్రమం మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులు వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వెంకటపతి రాజు, సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.