Jul 28,2021 07:19
  • మరో బౌట్‌ గెలిస్తే కాంస్యం ఖాయం
  • 23న క్వార్టర్‌లో నెన్‌-చిన్‌-చెన్‌(తైపీ)తో పోటీ
  • షూటింగ్‌ ఫైనల్‌కు చేరిన మను-సౌరభ్‌ 7వ స్థానానికే పరిమితం

టోక్యో : మహిళల బాక్సింగ్‌లో లౌవీనా పతకానికి చేరువలో నిలిచింది. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో గెలిచి లౌలీనా బోర్గోహైన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో గెలిస్తే కనీసం కాంస్య పతకం లౌల్లీనాకు ఖాయం కానుంది. ఇక పురుషుల హాకీజట్టు స్పెయిన్‌జట్టుపై ఘన విజయం సాధించగా.. బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ జోడీ నేటి మ్యాచ్‌లో విజయం సాధించినా ఇంటిదారి పట్టడం బాధాకరం. మంగళవారం ఉదయం భారీ ఆశలతో బరిలోకి దిగిన షూటర్లు ఘోరంగా నిరాశపరిచారు. 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ స్టేజ్‌-1లో యువ షూటర్లు మను-సౌరభ్‌ మిక్స్‌డ్‌ జోడీ అగ్రస్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపినా.. స్టేజ్‌-2, ఫైనల్లో ఆ దూకుడు ప్రదర్శించలేకపోయారు. ఓవరాల్‌గా 7వ స్థానంలో నిలిచి పతకం చేరువలో నిలువలేకపోయారు. ఈ విభాగంలో చైనా 633.2, పోలెండ్‌ 630.8, దక్షిణ కొరియా 630.5పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో స్వర్ణ, రజిత, కాంస్యాలను సాధించాయి. అంజుమ్‌-దీపక్‌, పన్వార్‌-ఇలవేనియల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్స్‌ను దాటలేకపోయారు. మొత్తం క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 29జట్లు పోటీపడ్డాయి. ఇక మహిళల 64-69కిలోల బాక్సింగ్‌లో లౌల్లీనా బోర్గోహైన్‌ భారత్‌కు తీపికబురును అందించింది. రౌండ్‌-32లో బై లభించిన లౌల్లీనా.. రౌండ్‌ ఆఫ్‌-16లో జర్మనీ బాక్సర్‌ నదైన్‌ అపెట్జ్‌పై 3-2పాయింట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది.క్వార్టర్‌ఫైనల్లో గెలిస్తే లౌలీనాకు కనీసం కాంస్య పతకం దక్కనుంది. సెమీస్‌లో ఓడిన ఇద్దరు బాక్సర్లకు కాంస్య పతకాలు లభించనున్నాయి. శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో లౌలీనా చైనీస్‌ తైపీకి చెందిన నెన్‌-చిన్‌-చెన్‌తో తలపడనుంది. ఇకటేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింంగిల్స్‌లో శరత్‌ కమల్‌ మూడోరౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. ఒలింపిక్‌ ఛాంపియన్‌ మా లాంగ్‌ చేతిలో అతడు 1-4 గేమ్‌ల తేడాతో పరాజయాన్ని చవిచూసి ఇంటిదారిపట్టాడు.