Jul 03,2022 23:28

పత్తి పొలంలో రైతు (ఫైల్‌)

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి సాగు వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. గత ఖరీఫ్‌లో మిర్చి సాగు చేసిన రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవగా పత్తిధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికీ మార్కెట్‌లో పత్తి ధర క్వింటాలు రూ.9 వేలు పలుకుతోంది. దీంతో కనిష్టంగా రూ.7 వేలు పలికినా నష్టం ఉండదని రైతులు భావిస్తున్నారు. మిర్చి ధరలు సైతం ఆశాజనకంగా ఉన్నా గత సీజన్‌లో తామర తెగులు సోకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 1.90 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 75 వేల ఎకరాల్లోనే రైతులు కొంత మేరకు దిగుబడి సాధించారు. ఈ నష్టం నుంచి మిర్చి రైతులు ఇప్పటికీ కోలుకోలేదు. తామర తెగులు నివారణకు అవసరానికి మించి పురుగుమందులు వినియోగించాల్సి వచ్చింది. మిర్చికి పెట్టుబడులు మరింత పెరిగాయి. ధర బాగా రావడం వల్ల కొంత మంది రైతులు పెట్టుబడులు అయినా రాబట్టుకోగలిగారు. ఎక్కువ మంది రైతులు నష్టపోయారు. మిర్చి సాగు కంటే పత్తి సాగు మేలన్న భావనలో రైతులు ఉన్నారు.
అంతేగాక పల్నాడు ప్రాంతంలో నీటి వసతి ఉన్నా మాగాణి భూములు మినహా మిగతా ప్రాంతాల్లో వరి సాగుకు రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా వరి సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదు. పెట్టిన పెట్టుబడులైనా రాకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పల్నాడు జిల్లా రైతులు వరి సాగుకు సుముఖంగా లేరు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా మిర్చి, పత్తి సాగుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు.
వరి సాగుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే క్వింటాళ్‌కు రూ.400 వరకూ తక్కువ ధర లభించింది. ప్రధానంగా 76 కిలోల బస్తా ధాన్యం కనీస మద్దతు ధర ప్రకారం రూ.1450 లభించాల్సి ఉన్నా రెండేళ్లుగా రూ.1150 మించి ధర రావడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపిన బస్తా రూ.1100 నగదు మిల్లర్లు రైతులకి ఇచ్చి తరువాత కనీస మద్దతు ప్రకారం రైతు ఖాతాల్లో ప్రభుత్వం నుంచి సొమ్ము జమ అయిన తరువాత మిగతా సొమ్ము మిల్లర్లకు మౌఖిక ఒప్పందాలు జరిగాయి. వరి సాగులో ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టినా 40 బస్తాల వరకు దిగుబడి వస్తే తప్ప కనీసం పెట్టుబడి రాని పరిస్థితి నెలకొంది. గత ఏడాది అధిక వర్షాలతో దిగుబడి 25 బస్తాలకు తగ్గింది. దీంతో వరిసాగుకు కూడా అయిష్టత ప్రదర్శిస్తున్నారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 4.65 లక్షల ఎకరాల్లోపత్తి సాగవ్వాల్సి ఉండగా గతేడాది కేవలం 2.40 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అయితే ఈ ఏడాది కనీసం 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గదేడాది 2.65 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం 1.64 లక్షల ఎకరాల్లోనే సాగయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వరి, మిర్చి స్థానంలో ఖరీఫ్‌లో పత్తి సాగుకు మెట్ట ప్రాంత రైతులు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో 5.10 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా ఈ ఏడాది పూర్తి స్థాయిలో వర్షాల్లేక ఇంకా నారుమళ్లు ప్రారంభం కాలేదు.