Oct 18,2020 23:05

మెప్మా పీడీ ఎం.కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: పట్టణ పేదలకు అండగా ప్రభుత్వం ఉందని మెప్మా పీడీ ఎం.కిరణ్‌కుమార్‌ అన్నారు. ఈ నెలలో వైఎస్‌ఆర్‌ బీమా, జగనన్న తోడు పథకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీల్లో పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను 'ప్రజాశక్తి' ముఖాముఖిలో పీడీ వివిరించారు.
ప్ర: జిల్లాలో పట్టణ ప్రాంత పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది?
జ:
పట్టణ ప్రాంతాల్లో కోవిడ్‌ వైరస్‌ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. అద్దె ఇళ్లల్లో రోజువారీ వేతనాలపైనే ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు తీవ్ర సంక్షోభాన్ని తెచ్చి పెట్టింది. ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం వల్ల అవి ఎంతగానో పేదలను ఆదుకున్నాయి. మెప్మా ఆధ్వర్యాన లబ్ధిదారులను గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ ఆసరా కింద 4724 స్వయంశక్తి సంఘాల్లో ఉన్న 47,331 మంది మహిళలకు రూ.149 కోట్లు అందించాం. నాలుగు విడతల్లో ఈ సాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ప్ర: వైఎస్‌ఆర్‌ చేయూత కింద ఎంతమందికి ప్రయోజనం కల్పించారు? లబ్ధిదారులకు ఎలాంటి వ్యాపారాలు చేసుకునేందుకు వీలుంది?
జ:
ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో 153 వ్యాపారులు అర్హత సాధించారు. రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకునే చిరు వ్యాపారులు ఈ పథకాన్ని పొందడానికి అర్హులు. వారిని వార్డు సచివాయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాం. ఇప్పటికే ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలకు రూ.18,750 వంతున జమ చేయడం జరిగింది. నాలుగేళ్ల పాటు ఈ చేయూత అందించేందుకు ప్రభుత్వం పథకాన్ని రూపకల్పన చేసింది. రెండో విడత పూర్తి మొత్తాన్ని బ్యాంకు రుణంగా లబ్ధిదారునికి అందజేసి ఆ మొత్తాన్ని మూడేళ్లలో ప్రభుత్వమే తీరుస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న చిరు వ్యాపారులు ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి ఈ తోడ్పాటు ఎంతో ప్రయోజనకరం. బ్యాంకు రుణం పొందడం వల్ల లబ్ధిదారులకు బాధ్యత ఉంటుంది.
ప్ర: జగనన్న చేదోడు ఎప్పుడు ప్రారంభిస్తారు?
జ:
జగనన్న చేదోడు పథకాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈపథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. జిల్లాలో ఇప్పటికే ఈ పథకానికి 4500 మంది మహిళలు అర్హత సాధించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఈ పథకాన్ని ఈ నెల 27న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. లబ్ధిదారులు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా బ్యాంకు రుణంగా అందజేస్తారు. వడ్డీలేని రుణం కావడం వల్ల మహిళలకు ఎంతగానో ఉపకరిస్తుంది.
ప్ర: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వైఎస్‌ఆర్‌ బీమా ఎప్పుడు ప్రారంభమవుతుంది?
జ:
పట్టణ ప్రాంతంలో పేదలకు అసరా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ బీమాను ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న బీమా పథకానికి లబ్ధిదారులు తప్పని సరిగా ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. విపత్కర పరిస్థితి ఎదురైనపుడు ఆ కుటుంబానికి బీమా చెల్లించే వారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్‌ఆర్‌ బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. తెల్ల రేషన్‌కార్డుదారుడైతే చాలు అర్హత సాధించినట్టే. బిపిఎల్‌ కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం రూపకల్పన చేసింది. విపత్కర పరిస్థితిలో నెలకొన్న స్థితి ఆధారంగా పరిహారం చెల్లిస్తారు. ఈ నెల 21న వైఎస్‌ఆర్‌ బీమా ప్రారంభం కానుంది. వీటితో పాటు ప్రభుత్వం పట్టణ ప్రాంత పేదలకు అందించే పథకాలను క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.