Nov 26,2021 01:55

ప్రజాశక్తి - యలమంచిలి 

భూమి కొనుగోలు నిమిత్తం తెచ్చి ద్విచక్ర వాహనం బాక్స్‌లో ఉంచిన 30 లక్షల రూపాయలను స్థానిక రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడు పెంటకోట శ్రీనివాసరావు, టౌన్‌ ఎస్‌ఐ నీలకంఠేశ్వరరావుల కథనం ప్రకారం... రాంబిల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పెంటకోట శ్రీనివాసరావు ఆర్మీ ఉద్యోగి. ఆయన సెలవుపై వచ్చి ముందుగా కదుర్చుకున్న భూమి కొనుగోలు విషయమై పురోణి రాసుకోవడానికి స్థానిక రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఉన్న ఒక లేఖరు దగ్గరకు తన భార్యతో కలిసి వెళ్లారు. భూమి కొనుగోలు నిమిత్తం తెచ్చిన రూ.30 లక్షలు తన ద్విచక్రవాహనం బాక్స్‌లో ఉంచారు. ఒప్పంద వివరాలు మాట్లాడుకొని బైక్‌లో దాచిన రూ.30 లక్షలు తేవడానికి వెళ్లగా ఖాళీ బాక్స్‌ దర్శనమిచ్చింది. బైక్‌ బాక్స్‌ తాళం దానికే వదిలేయడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ మొత్తాన్ని అపహరించారు. రూ.30 లక్షలు చోరీకి గురికావడంతో బాధితుడు శ్రీనివాసరావు గగ్గోలు పెట్టారు. పరసరాల్లో కలియ తిరిగినా చోరీ వ్యక్తిని గమనించలేకపోయారు. భార్యా భర్తలిద్దరూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై టౌన్‌ ఎస్‌ఐ నీలకంఠేశ్వరావుని సంప్రదించగా చోరీ విషయమై ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.