May 13,2022 10:15

 పొట్టకూటికోసం వీధుల్లో పూలమ్ముకునే అమ్మాయి ఉన్నతవిద్య చదువుతుందని ఊహించగలమా? కాని ఆమె సాధించింది. అంతేనా...పిహెచ్‌డి కోసం ఏకంగా యునైట్‌డ్‌ స్టేట్స్‌ కాలిఫోర్నియా యూనివర్శిటీకి పయనమైంది. లక్ష్యం ఉండాలి. అందుకోసం గట్టిగా సంకల్పించుకోవాలి. ఆ మార్గంలో వెళ్లేందుకు కఠోర శ్రమచేయాలి. ఇవన్నీ చేసి నిరూపించిన ఆమె పేరు సరిత మాలీ(28).
ముంబయి మురికివాడల్లో పుట్టిపెరిగిన సరిత కుటుంబం పేదరికంతో సతమతమయ్యేది. లోకల్‌ ట్రైన్‌లో వెళ్లి సంతలో పూలు కొనుక్కురావడం, వాటిని మాలలు కట్టి వీధుల్లో అమ్మడం ఆ కుటుంబం దైనందిన కార్యక్రమం. అలా తండ్రి తెచ్చిన పూలను కట్టిన ఆ చిన్నారి చేతులు ఆ తరువాత సొంతంగా వాటిని అమ్మేందుకు వీధుల్లోకి వచ్చాయి. అప్పుడు సరిత 5వ తరగతే చదువుతోంది. అయినా నాన్న కష్టంలో తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నది. ఆమె కోరిక అదొక్కటే కాదు, పేదరికం వెక్కిరిస్తున్నా ఉన్నత చదువు చదువుకోవాలనుకుని కలలుగన్నది. అలా వీధుల్లో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు దేశాలు దాటింది. మున్సిపల్‌ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివిన సరిత కాలేజీ ఫీజుల కోసం తండ్రి మీద ఆధారపడకుండా ఇంటిదగ్గర ట్యూషన్లు చెప్పింది. ఆ తరువాత గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి చిరకాల స్వప్నమైన ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో ప్రవేశం పొందింది. 'జెఎన్‌యు నన్ను ఎంతో తీర్చిదిద్దింది. నా మార్గాన్ని సుగమం చేసింది. ఇక్కడ నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వారంతా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు' అంటున్న సరిత జెఎన్‌యులో ఎంఎ హిందీ లిటరేచర్‌ పూర్తిచేసింది.
'కుటుంబపోషణ కోసం నాన్న పడుతున్న కష్టం నన్ను కలిచివేసేది. అందుకే ఆయనకు ఎలాగైనా సహాయం చేయానలనుకున్నాను. అందుకే వీధుల్లో తిరిగి పూలు అమ్మాను. ట్రాఫిక్‌ కూడళ్ల దగ్గర పూల బొకేలు అమ్మేదాన్ని. అలా రోజుకు గరిష్టంగా రూ.300 సంపాదించి నాన్నకు ఇచ్చేదాన్ని' అంటూ అప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటుంది. 'నాకు చదువంటే చాలా ఇష్టం. 22 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచాన్ని పరిశోధించడం మొదలుపెట్టాను. అప్పుడు మొదలైన నా ప్రయాణం ఏడేళ్లపాటు నిరాటంకంగా సాగింది' అంటూ ఈ సందర్భంగా తన మనసులో మాటను ఫేస్‌బుక్‌ ఖాతాలో రాసుకొచ్చింది.

saritha
పూలమ్ముకునే అమ్మాయి

'ఈ రోజుకు కూడా ఢిల్లీ సిగ్నల్స్  దగ్గర కారు డోర్సు కొడుతూ ఏదో ఒకటి అమ్ముకుంటూ జీవిస్తున్న చిన్నారులను చూస్తే నా బాల్యం గుర్తుకువస్తుంది. అప్పుడు నా మనసును ఒక ప్రశ్న తొలచివేస్తుంటుంది. ఈ పిల్లలు ఎప్పటికైనా చదవగలరా? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది?' అంటున్న సరిత 'జీవితంలో పైకి ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధం. సమాజంలో అట్టడుగు వర్గాల వారి కష్టాలను ఎత్తిచూపేందుకే నేను విద్యారంగంలోకి ప్రవేశించాను. బడి బయట పిల్లల కోసం ఉచిత విద్య అందించాలన్నదే నా లక్ష్యం' అంటున్నారు. సరిత తమ్ముళిద్దరూ కూడా అక్క అనుసరించిన మార్గానే ఎంచుకుని ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఆ ఇద్దరికే కాదు ఇప్పుడు సరిత ఎంతోమంది తమ్ముళ్లకు, చెల్లెళ్లకు గొప్ప మార్గనిర్దేశకంగా నిలిచింది. 

saritha