Jun 10,2021 21:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పునరావాస పనులపై దృష్టి సారించాలని కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ సూచించారు. గురువారంనాడు ఆయన ఢల్లీీ నుండి వర్చువల్‌ విధానంలో పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు పనుల వేగం కూడా పెంచాలని సూచించారు. .ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు, వరదను దిగువకు మళ్లించే స్పిల్‌వే పనులు, 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద సమయంలో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఇసిఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పనులు చేపట్టి 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ రూపొందించిన కార్యాచరణను ఇఎన్‌సి నారాయణరెడ్డి వివరించారు. రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు అనుమతులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు ముందుగా ఖర్చుచేసిన నిధులను రీయింబర్స్‌ చేయడంలో జాప్యం జరుగుతోందని సకాలంలో పోలవరం బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

2022 ఖరీఫ్‌కు నీరిస్తాం..
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి 2022 ఖరీఫ్‌కు నీరిస్తామనిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. గురువారంనాడు తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం హయంలో చేసిన పొరపాట్ల వల్లే ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో తెలుగుదేశం చేసిన తప్పులను తాము చేయకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. రైతుల కళ్లలో ఆనందాన్ని చూడలేని తెలుగుదేశం నాయకులు రఘురామకఅష్ణరాజును ఏజెంట్‌గా పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మూడు శాఖలకు మంత్రిగా పని చేసి ఎమ్మెల్యేగాకూడా గెలవలేని లోకేష్‌కు తమప్రభుత్వాన్ని విమర్శించేస్థాయి లేదన్నారు. ఇప్పటికే వరుస ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి పొరుగురాష్ట్రంలో తలదాచుకుంటున్న తండ్రీకొడుకులకు పోలవరం పూర్తయితే పుట్టగతులు వుండవని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చంద్రబాబు, లోకేశ్‌ల నుద్దేశించి అన్నారు.