Mar 24,2023 23:58

మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు

ప్రజాశక్తి - టెక్కలి రూరల్‌: ఉపాధి హామీ కూలీలకు పూర్తిస్థాయిలో కూలి అందజేయాలని డ్వామా పీడీ జివి.చిట్టిరాజు అన్నారు శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో 15వ రౌండ్‌ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏప్రిల్‌ 2021-2022 మార్చి 31 వరకు రూ.11.96 కోట్లతో పనులు జరిగాయని అన్నారు. అందులో ఉపాధి కూలీలకు రూ.8 కోట్లు, పంచాయతీరాజ్‌ పనులకు రూ.2.43 కోట్లు, కాలువ నిర్మాణాలకు రూ.19 లక్షలు, ఐటిడిఎ పరిధిలో 96కాంపౌండ్‌ వాల్స్‌కు రూ.19 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రధానంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటినట్లు చెప్పారు. కానీ రోడ్లు, పైపులైన్లు వేసేటప్పుడు మొక్కలు చనిపోతున్నాయని అన్నారు. లింగాలవలస పంచాయతీలో వర్క్‌ కోసం 400 బస్తాలు సిమెంటు అడ్వాన్స్‌గా ఇచ్చినా పనులు చేపట్టలేదని సోషల్‌ ఆడిట్‌ సిబ్బంది గుర్తించారు. ప్రతి పంచాయతీలోనూ మొక్కలు పోవడం గుర్తించారు. ప్రతి పంచాయతీలోనూ హాజరుపట్టికలో దిద్దుబాట్లు ఉండడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లపై పిడి మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపిపి అట్లా సరోజనమ్మ, ఎపిడి బి.మురళీకృష్ణ, ఎంపిడిఒ జి.ఉమాసుందరి, ఎపిఒ బి.ప్రసాదరావు, ఎస్‌ఆర్‌పి సింహాద్రి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సోషల్‌ ఆడిట్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.