Jan 31,2023 21:10

ఆచంట వేమవరంలో రైతు సంఘం ఆధ్వర్యాన నిరసన

ప్రజాశక్తి - ఆచంట

టార్గెట్‌ పూర్తయిందన్న సాగు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్‌ విమర్శించారు. మంగళవారం ఆచంట వేమవరం, పోడూరు మండలం గుమ్మలూరు గ్రామాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం రాశులను పరిశీలించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యాలు మాసూళ్లు జరిగి నెలా 15 రోజులైనా ఇంకా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి గింజా కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో జరగడంలేదన్నారు. ఆర్‌బికె వద్దకు వెళ్లి అడగ్గా ఇంకా 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉందని పైఅధికారులకు తెలియజేశామని చెప్పారు. కొంత ధాన్యం మాత్రమే తీసుకుంటామని, ఇంకా నాలుగైదు మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉండిపోతుందని తెలిపారు. పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఇందుకూరి సూర్యనారాయణ రాజు, గుత్తుల రంగారావు, కొండేటి సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, నాగరాజు, నరసింహారావు పాల్గొన్నారు.