Jan 02,2022 16:25

సమాజ గమనంలో పుస్తకానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో .. ఓ మంచి పుస్తకం కొనుక్కో' అంటాడు కందుకూరి వీరేశలింగం పంతులు. 'ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక' అంటాడు ప్రజా కవి కాళోజీ. ఆలోచనకు ఆలంబన.. విజ్ఞాన సముపార్జన.. పుస్తకాలతోనే సాధ్యం. బోధన ముఖ్యోద్దేశం ఆలోచింపజేయడం. అందుకోసం పుస్తకాలు కావాలి.. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన విజ్ఞానం అవసరమవుతుంది. అవన్నీ ఒక దగ్గర దొరికేది ప్రతి ఏడాది జరిగే పుస్తక మహోత్సవంలోనే. ప్రపంచవ్యాప్తంగా అనేక పుస్తక ప్రదర్శనలు మహోత్సవంలా జరుగుతాయి.. ఆయా పుస్తక ప్రచురణకర్తలు కలిసి వీటిని నిర్వహిస్తూంటారు. ఈ బుక్‌ ఎగ్జిబిషన్లు ఎక్కడెక్కడో అరుదుగా దొరికే పుస్తకాల్ని సైతం పాఠకులకు అందించడంలో ప్రసిద్ధికెక్కాయి. ప్రతి ఏటా డిసెంబరు నెల చివరిలోగానీ, జనవరి మాసం మొదట్లో గానీ జరుగుతుంటాయి. మన దేశంలో ప్రధానంగా నగరాల్లో ఈ బుక్‌ ఫెయిర్స్‌ జరుగుతుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం 'విజయవాడ బుక్‌ ఫెయిర్‌', 'హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌', ప్రసిద్ధి పొందిన పుస్తక ప్రదర్శనలు. కరోనాతో గతసారి ఎగ్జిబిషన్‌కు ఆటంకమైనా.. లాక్‌డౌన్‌లో పుస్తకమే మనందరికీ తోడైంది. నేడు ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న క్రమంలో ఈ పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ విజయవంతంగా ముగిసింది. ఈ నెల ఒకటో తేదీన మన రాష్ట్రంలో విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..

ఎవరి అనుభవాల సారమైనా అక్షరాల్లో నిక్షిప్తమై పదుగురికీ పంచేది పుస్తకమే. ఆ పుస్తకాల్లో విజయాలు, అపజయాలు.. అనేక అనుభవాల మేళవింపులతో ఉంటాయి. అవి దేశాలవైనా.. మనుషులవైనా.. పోరాటాలైనా.. ఉన్నతవిద్యా సముపార్జనలో అయినా.. నేటి, భవిష్యత్తరానికి ఏమి చెయ్యాలో.. ఏమి చెయ్యకూడదో నేర్పేవి అంటే అతిశయోక్తి కాదు. మెదడు పదునెక్కేది.. ఆలోచనలు రేకెత్తించేది.. అవగాహన కలిగించేది.. అంతిమంగా చైతన్యవంతం అయ్యేది పుస్తకాలతోనే. మార్క్స్‌ఎంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచ మార్పుకు దోహదపడింది అంటే పుస్తకం ఎంత శక్తిమంతమో కదా! అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం మనదేశానికే మార్గం చూపింది. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం నేటికీ యువతను కదిలిస్తూ కవిత్వం రాయిస్తోంది. వెలుతురు దారుల్లో పయనించేలా చేస్తుంది. మరోప్రపంచ సాధ్యాన్ని తెలియజేస్తుంది.

విభిన్న విజ్ఞాన సముదాయం..
పుస్తకాల్లో విభిన్నత సర్వసాధారణం.. చరిత్రకు సంబంధించినవి కొన్నయితే.. సైన్సు విజ్ఞానం కలిగించేవి ఇంకొన్ని.. సాహిత్యాన్ని.. జీవిత చరిత్రల సారాన్ని తెలిపేవి మరికొన్ని. ఇంకా కథలు, కవిత్వాలు ఎలా రాయాలో నేర్పేవి.. గొప్ప గొప్ప రచయితలు రాసిన కవితలు, కథలు.. వ్యక్తిగతంగా రాసినవి.. సంకలనాలుగా వచ్చినవి.. యువతకు అవసరమైన విజ్ఞానాన్ని ఆయా సబ్జెక్టులకు సంబంధించి సవివరంగా ఉండేవి. శాస్త్రవేత్తల పరిశోధనా గ్రంథాలు మరికొన్ని.. ఇంకా చరిత్రకారుల అనుభవాలు పంచేవి.. ఎవరు ఏమి చదవాలో.. ఎలా చదవాలో.. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధపడాలో.. విజ్ఞాన సముపార్జనకు ఎలా ప్రణాళికలు వేసుకోవాలో తెలియజెప్పే వ్యక్తిత్వవికాస పుస్తకాలు.. కళలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భక్తి, ఆధ్యాత్మికం, చరిత్ర, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు, భూగర్భ శాస్త్రం, మానవ పరిణామ శాస్త్రంలో లోతైన అధ్యయనానికి కావాల్సినవన్నీ పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయి. కాగితాల దొంతరల్లో కూర్చిన అందమైన అర్థవంతమైన అక్షరాల వెంట పరుగుపెట్టే నేత్రాలు భావాన్ని గ్రహించి, మనసు పొరల్లో నిక్షిప్తం చేసే మరో ప్రపంచమే పుస్తకం. పుస్తకానికి వన్నె తగ్గలేదు.. ఆదరణ అంతకన్నా తరగలేదు.. వైభవం అసలు కోల్పోలేదు. పాఠకుడి ఆదరణ, జిజ్ఞాస మేరకు అన్ని రంగాల్లో విజ్ఞానం వికసితంగా విస్తరిస్తూనే ఉంది. అత్యాధునిక సమాచార సాంకేతిక విజ్ఞాన రంగంలోనూ, జీవరసాయన శాస్త్రాల్లో, జీవ వైవిధ్యంలో, జీవ సాంకేతిక, జీవ గణాంక రంగంలో, అంతరిక్ష, భాషా పరివ్యాప్త రంగం.. ఇలా ఎన్నో రంగాల్లో విజ్ఞానదాయక గ్రంథాలు అందుబాటులోకి వచ్చాయి. అనేక సందేహాలకు సమాధానాలు తెలియజేసేవి పుస్తకాలే. అవి విశ్వం గురించైనా.. సమాజాభివృద్ధినైనా తెలిపే పుస్తకాలే. పిల్లలకు బమ్మలు నేర్పేది.. రంగుల ప్రపంచం చూపించేది.. పండ్లూపూలు చూపించేది.. పశుపక్ష్యాదులను కళ్లముందుంచేది పుస్తకమే. ఇలా అందరికీ సంతోషాన్ని పంచేది పుస్తకమే. ఇలా చెప్పుకుంటూ పోతే విభిన్న విజ్ఞాన సముదాయిని పుస్తకం.

అంతర్జాలం వచ్చినా.. అక్షరమే కీలకం..
అంతర్జాలం వచ్చినా.. అక్షరం అత్యంత కీలకమైంది. నట్టింట్లోలా.. నెట్టింట్లో పొందుపరిచినా, ప్రతి ఒక్కరి అరచేతిలోనూ ట్యాబుల్లో.. ఐ ప్యాడుల్లో.. మొబైల్లో ఇమిడిపోయినా.. బ్లాగులు, వెబ్‌సైట్లు, ఈ-పేజీల్లో అవసరమైన విజ్ఞానం కళ్లముందు కదలాడుతున్నా... పాఠక ప్రియులు మాత్రం పుస్తకం వైపే మొగ్గు చూపేది. పుస్తక పఠనంపై అంతర్జాల ప్రభావం అంతంత మాత్రమే. అదే ప్రత్యామ్నాయం మాత్రం కాదు. పుస్తకం చేతబట్టి హాయిగా ఆస్వాదించే అనుభూతి స్క్రీనుల్లో కళ్లు చికిలిస్తే వచ్చేది కాదు. అందుకే నేటికీ పుస్తకాల ముద్రణా తగ్గలేదు. పాఠకుల ఆదరణ పెరుగుతూనే ఉంది. పుస్తకానికి ఉన్న విలువ అలాంటిది. ఏడాదికోసారి జరిగే పుస్తక ప్రదర్శన ఎప్పటికీ అందరం కలిసే పండుగే! పుస్తకాలు హస్తభూషణమే నేటికీ సౌలభ్యం. కాకపోతే ఖరీదు ఎక్కువున్న పుస్తకాలు కొనలేని వారు.. వెంటనే అందుబాటులో దొరకనవి.. దూరాలు తీసికెళ్లడానికి వీలుకాని వారు.. పిడిఎఫ్‌ రూపంలో ఇా పుస్తకాలపై ఆధారపడుతున్నారు. ప్రొఫెషనల్‌ విజ్ఞానానికి సంబంధించిన పెద్ద పెద్ద పుస్తకాలు ఎక్కువ శాతం అంతర్జాలంలో పుస్తకరూపంలోనే నిక్షిప్తం చేయబడుతున్నాయి. అయినప్పటికీ.. ఆ ఇాపుస్తకం అవసరమైన సమాచారం వరకైనా.. మొత్తమైనా ప్రింట్‌ తీసుకుని చదువుతున్నారు. అంటే అంతిమంగా పుస్తకం హస్తభూషణమే. అరుదైన పుస్తకాలు.. ఎప్పుడో గ్రంథస్తం చేసిన విలువైన పుస్తకాలు.. అంతర్జాలంలో ఇలాగే పొందుపరచబడుతున్నాయి. ఇటీవల సోవియట్‌ పుస్తకాలను అనీల్‌ బత్తుల సేకరించి ఇ బుక్‌ రూపంలో అంతర్జాలంలో ఉంచారు. ఇాపుస్తకాలు ఏవైనా ప్రింట్స్‌ తీసుకుని స్ప్రింగ్‌ బైండింగ్‌ చేయించుకుంటున్నారు. నేడు పిల్లలు నుండి పెద్దలు సైతం ఇదే ఫాలో అవుతున్నారు. ఏదేమైనా అంతర్జాల యుగంలోనూ అక్షరమే కీలకం.. పుస్తకమే భూషణం.

అక్షర సౌరమండలం..
వేల తుపాకులు గురిపెట్టినా వెనక్కి తగ్గని నియంతలు సైతం ఒక్క సిరాచుక్కను చూసి భయంతో వెనుదిరిగేలా చేసిన ఘనత పుస్తకానిది. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి ఎంత విస్తృతమైనా పుస్తకం తన ఉనికిని కోల్పోలేదు.. కోల్పోదు. విజ్ఞాన కేంద్రాలైన ఈ పుస్తకాల్లోనే ప్రపంచం విస్తృతంగా విస్తరించి ఉంది. పుస్తకాల్లో వికసించే విజ్ఞాన కుసుమాలు సమాజానికి ఎప్పటికీ సరికొత్త పరిమళాలు పంచేవే. దిశ-దశలను నిర్దేశిస్తూ సన్మార్గంలో నడిపించేవే. పుస్తకం చదువుతున్నపుడు కలిగే ఆనందం, ఉత్తేజం.. మాటల్లో చెప్పలేం.. వ్యక్తిత్వంలో మార్పు తేవడమే కాదు.. వ్యక్తిని తీర్చిదిద్దుతూ చైతన్యశీలుల్ని తయారుచేస్తుంది. పుస్తకం అమ్మ ఒడిని, నాన్న సాన్నిధ్యాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. అలాంటి అక్షరమే ఊపిరిగా జీవించే పాఠక ప్రియులకు పుస్తకప్రదర్శన గొప్ప అవకాశం. చదువరులకు కలిగే ఉత్సాహం చెప్పనలవి కాదు. అదో అందమైన అక్షరాల సౌరమండలమే!

జాతీయ ప్రదర్శనలు
ప్రతి సంవత్సరం నేషనల్‌ బుక్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఢిల్లీలోని ప్రగతి మైదానంలో అతిపెద్ద వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రదర్శించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు, భారతీయ భాషలు, దేశ విదేశాలకు చెందిన ప్రచురణకర్తలు గ్రంథాలను ఈ బుక్‌ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ ఎన్‌బిటి పుస్తక ప్రదర్శనలు నిర్వహించడమేగాక, మిగిలిన బుక్‌ ఫెయిర్‌లోనూ పాల్గని, గ్రంథాలను అందరి ముందుంచుతారు. దేశంలో ఢిల్లీ, కోల్‌కతాలో తర్వాత జరిగే అతిపెద్ద పుస్తక ప్రదర్శనలు విజయవాడ, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్స్‌ది ప్రత్యేక స్థానం. పుస్తక ప్రదర్శనలో పుస్తక ప్రచురణకర్తలు, విక్రేతలు, మార్కెటింగ్‌ ప్రతినిధులకే పరిమితం కాకుండా వివిధ దినపత్రికలు సైతం స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారతానికి చెందిన కొన్ని ప్రచురణ సంస్థలు తమ గ్రంథాలను పాఠకులకు చేరువ చేయడానికి ప్రయత్నించడం మంచి పరిణామం. పుస్తక సంస్కృతిని విస్తృత పరిస్తే అది విశ్వమానవాళి వికాసానికి దోహదపడుతుంది.

అంతర్జాతీయ సంస్థలు సైతం..
ఆక్స్‌ఫర్డు యూనివర్శిటీ ప్రెస్‌, ఓరియంట్‌ బ్లాక్‌ స్వాన్‌, కేంబ్రిడ్జి, పియర్సన్‌, టాటా మెగ్రాహిల్స్‌, ఓరియంట్‌ లాంగ్‌మెన్‌, ఇండియా బుకహేౌస్‌ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ గ్రంథాలతో పుస్తక ప్రదర్శనలో దర్శనమిస్తాయి. వీటితో పాటు ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవ చేతన, నవోదయ, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు, ఎమెస్కో, నేషనల్‌ బుక్‌ ట్రస్టు, సాహిత్య అకాడమి, తెలుగు పబ్లికేషన్స్‌ వంటి జాతీయ ప్రచురణ సంస్థలు సైతం ఎంతో విలువైన అరుదైన విజ్ఞాన గ్రంథాలను అందుబాటులోకి తెస్తున్నాయి. రూపా పబ్లికేషన్స్‌ నుండి చేతన్‌ భగత్‌, రస్కిన్‌ బాండ్‌ వంటి రచయితల పుస్తకాలు అత్యధికంగా అమ్ముడుపోవడం చూస్తుంటే యువత ఆలోచనలు ఏ రీతిన విస్తరించాయో అర్థమవుతోంది. చేతన్‌ భగత్‌, టు స్టేట్స్‌, త్రీ మిస్టేక్స్‌ ఆఫ్‌ మైలైఫ్‌, ఫైవ్‌ పాయింట్‌ సమ్‌వన్‌, వాట్‌ యంగ్‌ ఇండియా, రివల్యూషన్‌ 2020 వంటి గ్రంథాలు ఇప్పటికీ హాట్‌ కేకులే, రస్కిన్‌ బాండ్‌ చిల్డ్రన్‌ ఓమ్ని బస్‌, గ్రేట్‌ స్టోరీ ఫర్‌ చిల్ట్రన్‌, స్కూల్‌ డేస్‌ స్కూల్‌ టైమ్స్‌ వంటి పిల్లల పుస్తకాలకు క్రేజ్‌ తగ్గలేదు. ఇక విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గీతాంజలి అన్ని భాషల్లో పాఠకుల మనసు దోచుకుంటూనే ఉంది.

తెలుగు పుస్తకాల వన్నె
పుస్తక ప్రదర్శనల్లో తెలుగు గ్రంథాల వన్నె తగ్గలేదు. తెలుగు సాహిత్యంలో ధోరణులు, అస్తిత్వ ఉద్యమాలు, రచయితల పాత్ర, కథ, నవల, వచన కవిత- పరిణామ వికాసాలు, ఉద్యమాలు- పాట ప్రభావం, సినిమా, అభ్యుదయ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, బాల సాహిత్యం వంటి అంశాలపై ఎన్నో గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల కామిక్స్‌, ప్రాక్టీస్‌ పుస్తకాలు, నవలలు, ఆంగ్ల గ్రంథాలు, బిజినెస్‌, మేనేజిమెంట్‌, వ్యక్తిత్వ వికాసం, పోటీపరీక్షల పుస్తకాలే కాకుండా మిగిలిన రంగాల తెలుగు గ్రంథాలకూ విపరీతమైన ఆదరణ కనిపి స్తోంది. చిన్న పిల్లల కథల పుస్తకాలు, బాపు బమ్మలతో కామిక్‌ పుస్తకాలు, వట్టికోట ఆళ్వార్‌ స్వామి మట్టి మనిషి, గంగు నవల, చెహోవ్‌ కథల అనువాదాలు, గోర్కీ కథలు మన చదువులు గ్రంథాలను సందర్శకులు శోధించి, సాధించి మరీ కొంటారు.

ఆవిష్కరణలు.. కవనాలు..
వైద్యులే రోగుల వద్దకు వెళ్లాలని ఆనాటి ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ నార్మెన్‌ బెతూన్‌ పిలుపునిచ్చారు. పాఠకుల వద్దకు పుస్తకాన్ని తీసుకువెళ్లాలని నెత్తిన పెట్టుకుని మోసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు స్వామి. ఆయన కల ఇలా నిజమవుతోంది. పుస్తకాల అమ్మకాలకే పరిమితం కాకుండా రచయితల ప్రసంగాలు, ప్రముఖుల పరిచయాలు, గ్రంథావిష్కరణలు, సాహితీ కార్యక్రమాలు, చర్చా గోష్ఠులు, జనకవనాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు సైతం బుక్‌ ఫెస్టివల్‌లో జరిగేలా టైంటేబుల్‌, ఇందుకు ప్రత్యేకించి సాహిత్య ప్రాంగణాన్ని నెలకొల్పడం తెలుగు రాష్ట్రాల్లోని పుస్తక ప్రదర్శనల ప్రత్యేకత.

పెరుగుతున్న పుస్తక ప్రియులు
మునుపెన్నడూ లేనివిధంగా పుస్తకాల గురించిన వినూత్న పద్ధతుల్లో ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అది పుస్తక ప్రదర్శనకు రమ్మనే ఆహ్వానం అదనపు ఆదరణ. దీంతో లక్షలాది మంది పుస్తక ప్రియులు బుక్‌ ఫెయిర్‌లో పాల్గంటున్నారు. పుస్తకాల పఠనం తగ్గిందని చెబుతున్న డిజిటల్‌ యుగంలో పుస్తక ప్రియులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గనడం ఆ మాటను చెరిపేస్తోంది. కరోనాతో కొంత గ్యాప్‌ వచ్చినా పుస్తకం మాత్రం వర్ధిల్లుతూనే ఉంది. ఆమాటకొస్తే కరోనా సమయంలో అనేక మంది పుస్తకాలతోనే కాలక్షేపం చేశారు. అంతేగాక పుస్తక ప్రదర్శనకు అపూర్వ ఆదరణ లభించడమే గాక, లక్షలాది పుస్తకాలు విక్రయం జరుగుతున్నాయనేది మొన్న ముగిసిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ నిరూపించింది.

అంతర్జాతీయ ప్రదర్శనలు
ప్రపంచవ్యాప్తంగా పుస్తకప్రదర్శనలకు ఎంతో చరిత్ర ఉంది. పెరాటి ఇంటర్నేషనల్‌ లిటరరీ ఫెస్టివల్‌ బ్రెజిల్‌, సిడ్నీ రైటర్స్‌ ఫెస్టివల్‌ ఆస్ట్రేలియా, ఎడిన్‌బర్గ్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెస్టివల్‌ స్కాట్లాండ్‌, బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ లిటరరీ ఫెస్టివల్‌- జర్మనీ, బ్రూక్లీ బుక్‌ఫెస్టివల్‌- యుఎస్‌ఎ, ఇరవాడి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెస్టివల్‌ మయన్మార్‌ వంటివి అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిగడించాయి. షాంఘై లిటరరీ ఫెస్టివల్‌, వర్డ్సు బై వాటర్‌ ఫెస్టివల్‌ కాంబ్రియా, సదరన్‌ లిటరరీ ఫెస్టివల్‌ మిస్సిసిపీ, పెన్‌ వర్డ్సు వాయిస్‌ ఫెస్టివల్‌ న్యూయార్క్‌, ఎల్‌ఎ టైమ్స్‌ లిటరరీ ఫెస్టివల్‌ లాస్‌ ఏంజెల్స్‌, లిటరేచర్‌ ఫెస్టివల్‌ ఇటలీ, నేషనల్‌ బుక్‌ ఫెస్టివల్‌ వాషింగ్టన్‌, అగాథ క్రిస్టీ బుక్‌ ఫెస్టివల్‌ - యుకె, ఆథర్స్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ -కెనడా, వాంకోవర్‌ రైటర్స్‌ ఫెస్టివల్‌ కెనడా, మియామీ బుక్‌ ఫెయిర్‌- యుఎస్‌ఎ, జీ జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌, హే ఫెస్టివల్‌ కొలంబియా, టోక్యో ఇంటర్నేషనల్‌ లిటరరీ ఫెస్టివల్‌ జపాన్‌, పోర్టు ఇలియట్‌ ఫెస్టివల్‌ ఇంగ్లాండ్‌ సైతం అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున జరిగే బుక్‌ ఫెస్టివల్‌గా ఖ్యాతి గడించాయి. అంతర్జాతీయ హోదా లభించకున్నా వాస్తవానికి విజయవాడ, హైదరాబాద్‌ బుక్‌ ఫెస్టివల్స్‌ సైతం అదే తరహాలో నిర్ణీత నియమ నిబంధనావళితో జరుగుతోంది.

ఈ పుస్తక మహోత్సవాలు ప్రజల విశిష్ట ఆదరణ పొందుతున్నాయి. ఏటా సుమారు ఎగ్జిబిషన్‌ ముగిసేలోపు దాదాపు ఐదు లక్షల మంది పుస్తకాభిమానులు బుక్‌ఫెయిర్‌ను సందర్శిస్తారంటే అతిశయోక్తి కాదు. కానీ నేటి కోవిడ్‌ కాలంలో కొంతమేరకు తగ్గినా.. పుస్తకం మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. అక్కున చేర్చుకుంటూనే ఉంటుంది. తన అవసరాన్నీ తెలియజేస్తూ ఉంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ సారి జరుగుతున్న పుస్తక ప్రదర్శనను విజయవంతం చేసుకుందాం. పలుసార్లు బుక్‌ఫెయిర్‌లో కలుసుకున్న వాళ్లంతా నిజ జీవితంలో 'రీడర్స్‌ కమ్యూనిటీ'గా ఏర్పడతారు. పుస్తక స్నేహం, పఠన మైత్రి వ్యక్తుల మధ్య చక్కటి సాంస్కృతిక బాంధవ్యాన్ని ఏర్పరుస్తుంది.

పుస్తకాలకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు
ప్రతి ఏటా లక్షలాది మంది పుస్తక ప్రియులు ఇందులో పాల్గంటున్నారు. పుస్తకాలకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహారణ. ఇప్పటికి 32 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. పుస్తక రూపం మారిందే కానీ ఆదరణ ఇప్పటికీ ఉంది. ఇంటర్నెట్‌, ఫోన్‌, ట్యాబ్‌లలో పుస్తకాలను చదువుతున్నారు. కానీ పుస్తకం పట్టుకొని చదివితే వచ్చే అనుభూతి వేరే ఉంటుంది.
ఈ సారి బుక్‌ఫెయిర్‌లో రచయితలను, కవులను ప్రోత్సహించేందుకు వారి రచనలను బుక్‌ఫెయిర్‌ తీసుకొని ఒక స్టాల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. రచయితలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఈనెల ఒకటో తారీఖు నుంచి 11 వరకు ఇది జరుగుతుంది. దేశంలో ఉన్న అసహన పరిస్థితులలో ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలు ఎంతో అవసరం. మన దేశంలో ప్రవేశ రుసుము లేని ఒకే ఒక పుస్తక ప్రదర్శన ఇది. లుక్‌ కల్చర్‌ నుంచి యవతను బుక్‌ కల్చర్‌లోకి తీసుకురావడానికి ఇలాంటి పుస్తక ప్రదర్శనలు తోడ్పడతాయి.
- కె. లక్ష్మయ్య, కార్యదర్శి, విజయవాడ బుక్‌ పెెస్టివల్‌ సొసైటీ