Oct 15,2020 17:23

ఒకప్పుడు వైద్య సిబ్బంది మాత్రమే మాస్కులు ధరించేవారు. మరీ ముఖ్యమంగా ఆపరేషన్‌ థియేటర్‌లోనే మాస్కులు ధరించేవారు. అలాగే కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు కూడా తమనితాము కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మాస్కులు ధరించేవారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో మాస్కు‌ ధరించడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అయితే ఎన్నాళ్లిలా మాస్క్‌ ధరిస్తారు తీసేయండంటూ.. అప్పుడే పుట్టిన పాప ప్రశ్నించినట్లుగా ఒక వింత ఘటన జరిగింది. యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)లో ఈ ఘటన చోటుచేసుకుంది. యూఏఈకి చెందిన డాక్టర్‌ సమీర్‌ చీబ్‌ అప్పుడే పుట్టిన పాపను ఎత్తుకోగా.. ఆ పాప ఆయన ధరించిన మాస్కు‌ను చేత్తో లాగేయడంతో.. ఆశ్చర్యపోతూ చిరునవ్వులు చిందించారు. .. 2020లోనే నేను చూసిన అద్భుతమైన ఫొటో ఇది అనే క్యాప్షన్‌తో.. ఆ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అంతా సజావుగా ఉంటే అందరం మాస్కు లేకుండా బయటకు వెళ్లగలిగే రోజులు త్వరలోనే రావాలనడానికి ఈ ఫొటో ఓ సంకేతం... అని తెలిపారు. అయితే ఈ పోస్ట్‌పై కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చినా, అది పూర్తిగా అంతమైపోదని, మాస్కు ధరిస్తే కరోనాతోపాటు, ఇతర వైరస్‌లు కూడా సోకకుండా జాగ్రత్త పడవచ్చు అంటూ నెటిజన్లు సలహాలిస్తున్నారు.