May 13,2022 08:34

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి : ఈయన పేరు పన్నీర్‌ సెల్వం. చిత్తూరు జిల్లా నగరిలో పవర్‌లూమ్‌ కార్మికునిగా పని చేస్తున్నారు. ఈయనకు రెండు మగ్గాలు ఉన్నాయి. వీటికి గతనెలలో రూ.1206 కరెంటు బిల్లు రాగా, ఈ నెల రూ.3563 బిల్లు వచ్చింది. బిల్లు చూసిన పన్నీర్‌సెల్వంకు గుండె గుభిల్లుమంది. ఆరా తీస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీ (విద్యుత్‌ సుంకం) పేరుతో అదనంగా బిల్లు వేశారని విద్యుత్‌ అధికారులు తెలిపారు.
     ఇది ఒక్క పన్నీరు సెల్వానికే కాదు, నగరి నియోజక వర్గంలోని పవర్‌లూమ్‌ కార్మికులందరిదీ ఇదే పరిస్థితి. గత నెల కంటే ఈ నెల రెండు, మూడు రెట్లు అదనంగా బిల్లులు వచ్చాయి. వీటిని చూసిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈడి పేరుతో విద్యుత్‌ అధికారులు ఎడాపెడా ఛార్జీలు వేస్తున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి రోజా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
నగరి ప్రాంతంలో పవర్‌లూమ్‌ పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నియోజకవర్గంలో 12 వేల మగ్గాలు ఉన్నాయి. నగరి, పుత్తూరు, నారాయణవనం ప్రాంతాల్లో దాదాపు 50 వేల మంది కార్మికులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా కారణంగా అన్ని వృత్తులతో పాటు ఈ వత్తిదారులు కూడా అష్టకష్టాలు పడ్డారు. పనుల్లేక చాలామంది ఈ వృత్తిని వదిలేసి వివిధ ప్రాంతాలకు వలస పోయారు. చెన్నై నగరాల్లో భవననిర్మాణ కార్మికులుగా, అపార్టుమెంట్లలో వాచ్‌మెన్‌లుగా, కొందరు భిక్షగాళ్లుగా మారిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల పరిస్థితుల్లో కొంత మార్పు రావడంతో తిరిగి పనుల్లో కుదురుకుంటున్న సందర్భంలో వీరిని విద్యుత్‌ ఛార్జీలు వేధిస్తున్నాయి.
 

                                                     ఈడి పేరుతో అదనపు వసూళ్లు

ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. గతంలో రూ.6 పైసలు వసూలు చేసే ప్రాంతంలో నేడు రూ.98 పైసలు వసూలు చేస్తున్నారు. దీని మూలంగా ఏప్రిల్‌ వరకు రూ.1500 వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.3000 వస్తోంది. దీనిపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు నారాయణ వనం మండలంలో మూర్తి అనే కార్మికునికి గత నెల రూ. 3758 వచ్చేది, ఈ నెలలో రూ. 7512 వచ్చింది. విద్యుత్‌ డ్యూటీ వేస్తున్నారని, దీనిపై మాకు ఏమీ తెలీదు అని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వమే ఇది వేస్తోందని సమాచారం.
 

                                                    ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ సహకారం

ఇతర రాష్ట్రాల్లో పవర్‌లూమ్‌ కార్మికులకు ఆయా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. తమిళనాడులో 550 యూనిట్ల వరకు ఉచితంగా అక్కడి ప్రభుత్వం ఇస్తోంది. కేరళలలో కూడా పవర్‌లూమ్‌ కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటోంది. మన రాష్ట్రంలోనే కార్మికులపై ప్రభుత్వం వివిధ రకాల భారాలు మోపుతున్నారు. కుటీర పరిశ్రమలను ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇలా దాడి చేస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

                                                         మంత్రి రోజా నోరు విప్పాలి

తన సొంత నియోజకవర్గంలోని కార్మికులకు ఇలా భారాలు పడుతుంటే మంత్రి రాజా ఎందుకు నోరు మెదపడం లేదు..? వెంటనే దీనిపై ఆమె స్పందించి అదనపు ఛార్జీలు రద్దు చేయాలి
                                            - సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడగంగరాజు