Oct 02,2022 22:45
  • పిడిఎఫ్‌, స్వతంత్ర అభ్యర్ధులను గెలిపించాలని యుటిఎఫ్‌, ఎస్‌టియు, ప్రజాసంఘాల పిలుపు
  • పిడిఎఫ్‌ నుంచి బాబురెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రమాప్రభ
  • స్వతంత్ర అభ్యర్థులుగా కత్తి నరసింహారెడ్డి, నాగరాజులకు మద్దతు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న శాసన మండలి పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికల్లో ఉద్యమ అభ్యర్థులను గెలిపించుకోవాలని యుటిఎఫ్‌, ఎస్‌టియుతో పాటు పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో యటిఎఫ్‌ మధ్యంతర కౌన్సిల్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పిడిఎఫ్‌ నుంచి శాసన మండలికి పోటీ చేస్తున్న తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజక అభ్యర్ధులు పి బాబురెడ్డి, మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉత్తరాంధ్ర నియోజక వర్గ పట్టభద్ర నియోజక వర్గం నుంచి రమాప్రభను, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజక వర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులను బలపర్చాలని నిర్ణయించారు. అనంతరం జరిగిన పరిచయ సభలో వీరికి సంపూర్ణమద్దతు ఇస్తున్నట్లు యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్‌టిఎఫ్‌తో పాటు వివిధ ప్రజాసంఘాలు కూడా యుటిఎఫ్‌ బలపరిచిన పిడిఎఫ్‌, స్వతంత్ర అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించాయి. ఉద్యమ అభ్యర్థులను గెలిపించుకోవడంద్వారానే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపాయి. అంతకుముందు ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యా రంగంలో తీసుకొస్తున్న వివిధ ప్రజా వ్యతిరేక సంస్కరణలను నిరసిస్తూ పిడిఎఫ్‌ మండలిలో బలమైన వాణి వినిపిస్తోందని అన్నారు. ఈ గళాన్ని బలపరచడంకోసం మరికొందరు పిడిఎఫ్‌ అభ్యర్థులను మండలికి పంపాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన శాసన మండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ వి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ, దుర్మార్గమైన విధానాలను రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. రెండేళ్లల్లో విద్యారంగం కనుమరుగవుతుందనే విధంగా ప్రభుత్వం భయాందోళనకు గురిచేసిందన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్ల అమర్చుడం, ఇంటి పన్ను పెంచడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రంతో కలిసి అమలు చేస్తోందన్నారు. రాజధాని బిల్లు, ఇంగ్లీష్‌ మీడియం బిల్లులకు ఆమోదం తెలపకపోతే శాసనమండలిని రద్దు చేస్తామని ప్రభుత్వం బెదిరించిందన్నారు. అయినా తమ విధానం మారదని, మండలి లేకపోతే నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటామని ప్రభుత్వానికి స్పష్టం చేశామన్నారు. సుదీర్ఘకాలం సామాజిక ఉద్యమాల్లో ఉన్న వారినే పిడిఎఫ్‌ అభ్యర్ధులుగా నిలబెడుతున్నామని చెప్పారు. డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ పిడిఎఫ్‌గా తొలి నుంచి తాము ప్రభుత్వ విద్యా రంగం, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పరిరక్షణ, కార్మికులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి ఉద్యోగాలు భర్తీ కోసం, సామాజిక వర్గాల ప్రయోజనాలను మండలిలో వినిపించడం, ప్రజసంఘాలు, కార్మిక సంఘాల ఉద్యమాలకు మద్దతు తెలపడం అనే లక్ష్యాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వాజ్‌పాయి ప్రభుత్వ హయాంలో సిపిఎస్‌ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు. దీనిని రద్దు చేయాలని ఇటీవల చేసిన ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసులు పెట్టి నిరంకుశంగా వ్యహరించిందన్నారు. పట్టభద్ర, ఉపాధ్యాయ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ నాయకులకు చెప్పారని తెలిపారు. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు వినడం లేదనే కక్షతో అన్ని చోట్ల అభ్యర్ధులను నిలబెడుతున్నారన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో ఓటర్లను పలు ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురిచేస్తుందని, గతంలో టిడిపి ఇలానే చేసిందని గుర్తుచేశారు. వీటిని తట్టుకొని ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గం ఒక వైపు ఉంటే పాలక వర్గం మరోవైపు ఈ ఎన్నికల్లో ఉందన్నారు. ఈ ఎన్నికలను సిపిఎస్‌కు జిపిఎస్‌కు రెఫరెండంగా భావించాలని చెప్పారు. వైసిపి, టిడిపి, బిజెపి, జనసేన ఒక్కటేనని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి పోరాడే శక్తి ఈ పార్టీలకు లేదన్నారు. రాష్ట్రాన్ని వైసిపి పాలిస్తుందో? బిజెపి పాలిస్తుందో అర్ధం కావడం లేదన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిగా నిలబడిన ద్రౌపది ముర్ముకే రాష్ట్రం నుంచి అన్ని ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ అభ్యర్ధి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ మండలిలో సామాన్య ప్రజలు, ఉపాధ్యాయుల గొంతుకను వినిపిస్తోంది పిడిఎఫ్‌, దానికి అనుబంధంగా ఉన్న తాము తప్ప మరోకరు కాదన్నారు. సిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రతిన పూనారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ సభలో ఎస్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యరద్శులు సాయి శ్రీనివాస్‌, తిమ్మన్న, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజరు కుమార్‌, ఉన్నత విద్య పరిరక్షణ నాయకులు రాజగోపాల్‌, ఐద్యా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, జనవిజ్ఞాన వేదిక నాయకులు శ్రీనివాస్‌, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు బోస్‌బాబు ప్రసంగించారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, కెవిపిఎస్‌ ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శులు జి రామన్న, ఎ అశోక్‌, ఎల్‌ఐసి ఉద్యోగుల అసోసియేషన్‌ నాయకులు కళాధర్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, కౌలు రైతు సంఘం నాయకులు రాధాకృష్ణ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గని మద్దతు తెలిపారు.