Nov 30,2022 22:20
  • బకాయిలు అడిగినందుకు అరెస్ట్‌లు
  • ధర్నా శిబిరాన్ని ధ్వంసం చేసిన పోలీసులు
  • నిరసనగా 'జాగరణ'

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై మరోసారి ఉక్కుపాదం మోపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ధర్నా చేపట్టిన యుటిఎఫ్‌ నాయకులను, మద్దతు తెలిపిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధర్నా శిబిరాన్ని ధ్వంసం చేశారు. దీంతో విజవాడలోని ధర్నా చౌక్‌ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలల తరబడి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం నుంచే ఉపాధ్యాయులపై నిర్బంధం ప్రయోగించారు. వివిధ జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేశారు. బుధవారం ఉదయం నుంచే దీక్షా శిబిరం వద్ద పెద్దఎత్తున మోహరించారు. ధర్నా శిబిరం వైపు ఎవరినీ రానీయలేదు. వాహనాలూ రాకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. నిర్బంధాన్ని అధిగమించి ధర్నా శిబిరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి, యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పోలీసులు అడ్డుకున్నారు.
అరెస్టు సమయంలో ఎమ్మెల్సీ వెంటకేశ్వరరావు ప్రతిఘటించడంతో ఆయన్ని ఎత్తుకెళ్లి వ్యానులో ఎక్కించారు. అనుమతి ఉన్నప్పటికీ ఎన్నడూ లేని విధంగా ధర్నా శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. టెంట్లను పీకేశారు. కుర్చీలను పక్కనపడేశారు. ఎమ్మెల్సీలు, నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు వాగ్వివాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం నాయకులను బలవంతంగా పోలీసు వ్యానుల్లో ఎక్కించారు. వారిని సింగ్‌నగర్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఏఎన్‌ కుసుమకుమారి, కార్యదర్శి బి లక్ష్మీరాజా, ఏ కృష్ణసుందరరావు, ఐక్యఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు టిఎస్‌ఎల్‌ఎన్‌ మల్లేశ్వరరావు, ప్రచురణ విభాగం ఛైర్మన్‌ ఎం హనుమంతరావు ఉన్నారు. వీరినిసిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పరామర్శించారు. ధరాుకుఅనుమతి ఇచ్చి కూడా అడ్డుకోవడం, నిర్బంధించడం అక్రమం అనిపేర్కొనాురు. ఈ అరెస్టులు, నిర్బంధాలకు నిరసనగా యుటిఎఫ్‌ నిరసన జాగరణ కార్యక్రమం నిర్వహించింది. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.

  • అరెస్టులను ఖండించిన సిపిఎం

ఉపాధ్యాయులు తలపెట్టిన ధర్నాను అడ్డుకొని అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పిఆర్‌సి చర్చల సందర్భంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.650 కోట్లు మార్చి 2022 నాటికి క్లియర్‌ చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం సమక్షంలో ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు పూర్తి బకాయిలు చెల్లించలేదని పేర్కొన్నారు. మంజూరైన పిఎఫ్‌, తదితర లోన్లు జమ చేయకపోవడం, సిపిఎస్‌ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వ వాటా చెల్లించకపోవడం, రిటైరయిన వారి బెనిఫిట్స్‌ చెల్లించకపోవడం తదితర సమస్యలపై యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు ఈ ధర్నాను అడ్డుకొని యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సహా 250 మందికిపైగా అరెస్టు చేశారని వివరించారు. ముందు రోజు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. న్యాయంగా చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా వారిపై నిర్బంధాన్ని ప్రయోగించడం గర్హనీయమన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన అప్రజాస్వామిక చర్యలు మానుకుని ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల డిమాండ్లకు, ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

  • ఎపిటిఎఫ్‌ ఖండన

శాంతియుతంగా నిర్వహిస్తును ఉపాధ్యాయులు, నాయకులు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడాన్ని ఎపిటిఎఫ్‌ ఖండించింది. ఈ మేరకు ఎపిటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు.
 

mlc-teachers-union-leaders-arrest-in-vijayawada-utf-leader

 

mlc-teachers-union-leaders-arrest-in-vijayawada-utf-leader

 

mlc-teachers-union-leaders-arrest-in-vijayawada-utf-leader

 

mlc-teachers-union-leaders-arrest-in-vijayawada-utf-leader

 

utf-protest

 

mlc-teachers-union-leaders-arrest-in-vijayawada-utf-leader

 

mlc-teachers-union-leaders-arrest-in-vijayawada-utf-leader

 

utf-protest

 

utf-protest