Jul 28,2021 17:16

న్యూఢిల్లీ : తన ఫోన్‌ కూడా హ్యాక్‌కు గురైందని, ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం పేర్కొన్నారు. అభిషేక్‌ ముఖర్జీ ఫోన్‌ హ్యాక్‌ చేయబడిందని.. దీంతో తాను అభిషేక్‌తో మాట్లాడితే.. అవన్నీ రికార్ట్‌ అయినట్లేనని అంటే తన ఫోన్‌ కూడా హ్యాక్‌కు గురైనట్లేనని అన్నారు. పెగాసస్‌ అందరి జీవితాలను ప్రమాదంలో పడేసిందని అన్నారు. కాగా, పెగాసస్‌ కుంభకోణం వ్యవహారంపై బుధవారం జరిగిన ప్రతిపక్ష సమావేశానికి మమతా గైర్హాజరయ్యారు. ప్రత్యేక మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై కొనసాగే యుద్ధంలో తాను ముందువరసలో ఉంటానని, ఈ యుద్ధం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని అన్నారు. కాగా, ప్రతిపక్షాలన్నింటికీ ఎవరు నాయకత్వం వహిస్తారు అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తాను జ్యోతిష్యురాలిని కాదని.. ఎవరు నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. తాను ఒక సాధారణ కార్యకర్తనని, చివరి వరకు అలాగే కొనసాగుతానని స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణ అవసరమని, పార్లమెంట్‌ సెషన్‌ అనంతరం వాటిపై చర్చలు ప్రారంభమవుతాయని చెప్పారు. మంగళవారం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కూడా చర్చించానని, అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని అన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని, ఈ అంశంపై త్వరలో భేటీకానున్నామని స్పష్టం చేశారు. అలాగే మంగళవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కమల్‌నాథ్‌, అనంద్‌ శర్మలతో కూడా సమావేశమయినట్లు సమాచారం. అనంతరం మమతా బెనర్జీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేసేందుకు అవసరమైన చర్చలు జరిపినట్లు సమాచారం. ఐదురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కూడా సమావేశం కానున్నట్లు తెలిపారు. మంగళవారం మమతాబెనర్జీ ప్రధాని మోడీతో సమావేశమైన సంగతి తెలిసిందే.