Jul 21,2021 19:26

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్‌ పెగాసస్‌ సెగతో సతమతమౌతోంది. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, హక్కుల కార్యకర్తలు, వ్యాపారులు, జర్నలిస్టులతో పాటు ఇతరుల ఫోన్లను హ్యాక్‌ చేశారన్న వార్తపై బిజెపి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా స్పందించడంతో... వీటిని తిప్పికొట్టేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్‌ కమల దళాధి నేతలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రులను బిజెపి రంగంలోకి దింపింది. పెగాసస్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకు పైగా ఫోన్లు స్పైవేర్‌ నిఘా నీడలో ఉన్నట్లు దివైర్‌తో పాటు 16 మీడియా సంస్థలు బహిర్గతం చేసిన సంగతి విదితమే. భారత్‌లో విడుదల చేసిన జాబితా ప్రకారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతల పేర్లు ఉన్నాయి. కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఫోన్‌ కూడా హ్యాక్‌ గురైనట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్స్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ నిర్వహించిన డిజిటల్‌ ఫోరెన్సిక్‌లో వెల్లడైంది. వాస్తవాలు బయటపడుతుండటంతో మోడీ సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో అప్రమత్తమైన బిజెపి నేతలు తిరిగి వారిపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి ముఖ్యమంత్రులు రంగంలోకి దిగడం గమనార్హం.

కమల దళం ఎదురు దాడి
    ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగిన వారిలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖతర్‌, మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అసోం ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మ, గుజరాత్‌ సిఎం విజయ్ రూపానీ, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జై రామ్‌ ఠాకూర్‌, ఉత్తరాఖండ్‌ సిఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ ఉన్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో పాటు సీనియర్‌ బిజెపి నేతలు, బిజెపియేతర రాష్ట్రాల్లోని నేతలు కూడా విపక్షాలపై ఎదురు దాడి చేశారు. కాగా, వీరెవ్వరూ ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌ సంస్థ నుండి బిజెపి సర్కార్‌ పెగాసస్‌ స్పైవేర్‌ ఉపయోగించిందన్న ఆరోపణలను మాత్రం తోసిపుచ్చలేదు. బహిర్గతం చేసిన నివేదికలపై విచారణ జరుపుతున్న మీడియా కన్సార్టియంపై.... ఈ బృందం విరుచుకుపడింది. అసలు మీడియా ఎలా వెల్లడి చేసిందన్న దానిపై పలు వాదనలు తీసుకు వచ్చారు. భారత్‌ను కించపరిచేందుకు చేస్తోన్న అంతర్జాతీయ కుట్ర అంటూ ఆరోపణలు చేశారు.

ఎవరెవరూ ఎలాంటి ఆరోపణలు చేశారంటే..
'కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలన్నీ చెత్త, విమర్శనాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నాయి. సెకండ్‌ వేవ్‌లో కూడా ఇలానే చేశాయి. విపక్షం తెలుసో, తెలియకో అంతర్జాతీయ కుట్రకు బలైపోతోంది' అని యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హద్రాస్‌ ఘటన సమయంలో పోలీసులు ప్రతిపక్షాల నుండి విమర్శలు చేయడంతో ఆ సమయంలో కూడా అది అంతర్జాతీయ కుట్ర అని సెలవిచ్చారు యోగి. ఇక ఇటీవల అసోం బాధ్యతలు చేపట్టిన హిమాంత శర్మ ఇటువంటి ఆరోపణలే చేశారు. 'ఈ కథను కొన్ని అంతర్జాతీయ మీడియా, భారత్‌లోని కొన్ని న్యూస్‌ ఛాన్నళ్లు కలిపి అల్లాయి. మాకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భాగస్వామి అని చెబుతున్నాయి. అమ్నెస్టీ పాత్ర సంగతి మాకు తెలుసు. ఇది భారత్‌లో వామపక్షాలతో కూడిన టెర్రరిజంతో పాటు అన్నింటినీ ప్రోత్సహిస్తుంది. భారత్‌ పరువు తీసేందుకు రాతంతా శ్రమిస్తోంది. అమ్నెస్టీ విశ్వసనీయత మాకు తెలుసు' అంటూ దానిపై విరుచుకుపడ్డారు.
      ఇక గుజరాత్‌ సిఎం విజయ్ రూపానీ సంగతి వేరేచెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ కుట్ర పదజాలానికి మరికొంత ఎక్కువే వాడారు. ఈ వెల్లడైన విషయాన్ని బట్టి చూస్తే ప్రతిపక్షాలు 'దేశ వ్యతిరేక మనస్థత్వంతో' ఉన్నారని వెల్లడైందని అన్నారు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ అధికారాన్ని ఆస్వాదించిందని, ఇప్పుడు అధికారం లేకపోయే సరికి నీటిలో నుండి బయటపడ్డ చేప పిల్లలా గాలి కోసం గిలగిలా కొట్టుకుంటోందని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ఖ్యాతిని దెబ్బతీసేసి... వచ్చిన మూల్యంతో తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోందని, కానీ అది సాధ్యపడదని హిమాంత అన్నారు. ఇక ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి కూడా దేశ వ్యతిరేకులుగా ప్రతిపక్షాలపై ముద్ర వేశారు. ఈ విషయాన్ని పెద్దది చేసి... అభివృద్ధి పనులు నిలిపివేసేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని అన్నారు.
    మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వీరందరి దారిలో కాకుండా మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలపై నిత్యం నిఘా పెట్టేది బిజెపి కాదని, కాంగ్రెస్సేనని అన్నారు. రాహుల్‌ గాంధీపై నిఘా పెట్టాల్సిన అవసరం బిజెపికి లేదని, ఎందుకంటే... రాజకీయంలో ఆయన జీరో అంటూ తీవ్ర ఆరోపణ చేశారు. ఫోన్‌ ట్యాంపింగ్‌ చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందంటూ హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.