Jan 31,2023 15:10

పెషావర్‌  :  స్థానిక మసీదులో  సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 89కి చేరింది. మరో 150 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. రాత్రి నుండి ఇప్పటివరకు శిథిలాల నుండి తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.  ఇంకా శిథిలాలను తొలగించాల్సివుందని, శిథిలాల కింద చిక్కుకున్న వారు సజీవంగా ఉండే అవకాశాలు లేవని  సహాయక చర్యలు చేపడుతోన్న అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల  సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పెషావర్‌ ఆసుపత్రి అధికార ప్రతినిధి తెలిపారు. పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్స్‌లోని ఓ మసీదులో సోమవారం మధ్యాహ్నం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో అధిక శాతం మంది భద్రతా బలగాలు, పోలీసు అధికారులే ఉన్నారు.