
ఈ ఆర్థిక సంవత్సర (2021-22) విద్యుత్ టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కాములు) ప్రకటించాయి.రాష్ట్రంలోని గృహ విద్యుత్ వినియోగదార్లపై గతంలో ఎన్నడూ లేనిది కొత్తగా ఫిక్స్డ్ చార్జీలు వడ్డించారు. కనీస చార్జీలు లేవంటూనే డిస్కాములు ఈ కొత్త భారాన్ని మోపాయి. మిగిలిన చార్జీల విషయంలో దాదాపు మార్పు లేదు. గతంలో వున్న రాయితీలు కొనసాగుతాయి. అయితే, గృహ వినియోగదారులపై వేసిన ఫిక్స్డ్ చార్జీల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రంలోని మొత్తం వినియోగదారుల్లో అత్యధికులు గృహస్తులే కనుక దాని విస్తృతి కూడా అధికం.
కనీస చార్జీలు లేవంటూనే....
ఇకపై గృహ వినియోగదారుల నుంచి కనీస ఛార్జీలు వసూలు చేయబోమంటూనే ఫిక్స్డ్ చార్జీగా కిలోవాట్‌కు పది రూపాయలు వసూలు చేయాలన్న డిస్కాముల ప్రతిపాదనను ఇఆర్‌సి అంగీకరించింది. సాధారణంగా ఫిక్స్డ్/ డిమాండ్ చార్జీలు గృహేతర మరియు హెచ్.టి వినియోగదార్ల నుండి మాత్రమే వసూలు చేస్తారు. పేద, మధ్యతరగతి గృహ వినియోగదార్ల నుండి కూడా దాన్ని వసూలు చేయడం దారుణం. అందువల్ల ప్రతి గృహ వినియోగదారుపై ఏడాదికి కనీసం రూ.120 అదనపు భారం పడుతుంది. ఒక్క బల్బు వాడే వారైనా నెలకు అదనంగా పది రూపాయలు కట్టాలి.
నెలకు పది యూనిట్లు వినియోగించే గృహస్తు ఇంతకుమునుపు కనీస చార్జీ మూలంగా నెలకు (ఇంధన(కనీస)చార్జీ 25.00+ కస్టమర్ చార్జీ 25.00+ విద్యుత్ సుంకం 0.6+0) రూ.50.60 చెల్లిస్తే ఇకపై (14.50+25+0.6+ ఫిక్స్డ్ చార్జీ 10) రూ.50.10 చెల్లించాలి. అంటే తగ్గేది కేవలం అర్ధ రూపాయే! ఒక నెలలో ఒక్క యూనిట్ కూడా వాడని వారు గతంలో (25+25+0+0) రూ.50 చెల్లించేది ఇప్పుడు (0+25+0+10) రూ.35 చెల్లిస్తే సరిపోతుంది (కింది పట్టికను చూడండి). అలా నెలకు 17 యూనిట్లు వాడే వారి వరకు కొత్త టారిఫ్ ప్రకారం బిల్లు పెరగదు. నెలకు 18 యూనిట్ల నుండి వడ్డన పెరుగుతుంది. కాబట్టి కనీస చార్జీ రద్దు చేసి ఫిక్స్డ్ చార్జీలు విధిస్తున్నామన్న డిస్కాముల వాదన బూటకం. ఫిక్స్డ్ చార్జీలు గృహ వినియోగదారులకు ముమ్మాటికీ భారమే! నెలకు 20 యూనిట్లు వాడే నిరుపేద వినియోగదారు ఇప్పుడు రూ.55 బిల్లు చెల్లిస్తున్నవారు ఇకపై ఫిక్స్డ్ చార్జీ కలిపితే రూ.65 చెల్లించాలి. ఇలాంటి నిరుపేదలపైనే ఈ పెంపు 18 శాతం. అదే కనెక్టెడ్ లోడ్ ఎక్కువ అంటే మిక్సీ, ఫ్రిజ్, కూలర్ వంటివి ఉంటే ఫిక్స్డ్ చార్జీ భారం ప్రతి కిలోవాట్‌కూ పది రూపాయల చొప్పున ఇంకా పెరుగుతుంది. నామమాత్రపు విధింపు అంటూనే ఓ కొత్త భారాన్ని మోపుతున్నారు. అంతేగాక కనెక్టెడ్ లోడ్ ఎక్కువగా ఉందన్న సాకుతో వినియోగదారులపై వేధింపులు పెరిగేందుకూ అవకాశం ఉంది. విద్యుత్ అధికారులు 2019లో ఇళ్లలో చొరబడి మీ ఇంట్లో ఫ్రిజ్ వుంది, ఎ.సి వుంది, అదనపు కనెక్టెడ్ లోడ్‌కు కన్సమ్షన్ డిపాజిట్ కట్టాలని వేధింపులకు పాల్పడడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన తరువాత వెనక్కు తగ్గిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది.
ఇంతింతై.....
ఒకసారి ఫిక్స్డ్ చార్జీ అంటూ వేస్తే అది తదనంతర కాలంలో పెరుగుతూ పోయే ప్రమాదం ఉంది. సర్వీసు చార్జీల పేరిట కేంద్ర ప్రభుత్వం 1994లో ప్రారంభించినపుడు టెలిఫోన్ బిల్లు, జీవిత బీమా మినహా ఇతర బీమా ప్రీమియం, స్టాక్ మార్కెట్ బ్రోకరేజి- ఈ మూడిటిపైనే నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ ప్రతిపాదించారు. ఆ ఏడాది దేశమంతటా కలిపి సేవా పన్ను 3,943 మంది నుండి కేవలం రూ. 407 కోట్లు మాత్రమే సమకూరింది. ఆనాటి కేంద్ర ప్రభుత్వ పన్ను ఆదాయంలో అది ఒక్క శాతం కూడా లేదు. అనంతరం ఆ పన్ను సకల సేవలకూ విస్తరించడమేగాక 5 శాతంతో ప్రారంభమైన పన్ను రేటు 15 శాతానికి ఎగబాకింది. ఇప్పుడు జిఎస్టి రూపంలో 18 శాతం వరకు వసూలు చేస్తున్నారు. కాబట్టి సర్కారు ఓ కొత్త భారాన్ని ప్రవేశపెడితే అది అలా అలా ఆంజనేయుడి తోకలా పెరుగుతూ జనం నడ్డి విరుస్తుంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భారాలు వేయడానికి ప్రభుత్వాలు ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు.
ఆర్ఇసిఎస్ల రద్దు
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, విజయనగరం జిల్లా చీపురుపల్లి, చిత్తూరు జిల్లా కుప్పం కేంద్రాలుగా వున్న గ్రామీణ విద్యుత్ సహకార సొసైటీ (ఆర్‌ఇసిఎస్)లను ఆయా డిస్కాముల్లో విలీనం చేస్తున్నట్టు ఎపిఇఆర్సి ప్రకటించింది. గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల నిర్వహణకు ప్రభుత్వం సిఫార్సు చేయనందున వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని డిస్కాంలను ఆదేశించామన్నారు. ఇదిలా వుండగా లైసెన్స్ రెన్యువల్ కోసం నిర్దేశించిన రుసుము ఒక లక్ష రూపాయలు ఇఆర్‌సి కి చెల్లించామని చీపురుపల్లి ఆర్‌ఇసిఎస్ ఎం.డి మీడియాకు చెప్పారు. ఈ పాలనాపరమైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఈ మూడు ఆర్ఇసిఎస్లు వెనుకబడిన ప్రాంతాల్లోనే పని చేస్తున్నాయి. ప్రధానంగా చెరకు (బెల్లం గానుగలు), మామిడి, కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలపై ఆధారపడి జీవిస్తున్న రైతాంగానికి, ఆ ప్రాంతాల్లోని చిన్న ప్రాసెసింగ్ పరిశ్రమలకూ ఈ ప్రతిపాదన వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి విధానపరమైన మార్పు చేయడానికి ముందుగా సంబంధిత సంస్థలు, వ్యక్తుల (స్టేకహేోల్డర్ల)తో ఇఆర్‌సి విడిగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి వుండాల్సింది. అలాంటిదేమీ లేకుండా ఏకపక్షంగా విలీన ప్రకటన చేయడం వెనుక ఇంకేవైనా కారణాలున్నాయేమో పరిశీలించాలి. అయితే ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆర్ఇసిఎస్లను కొనసాగిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పి.రామచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు. ఆచరణలో ఏమవుతుందో చూడాలి. వెనుకబడిన ప్రాంతాల రైతుల ప్రయోజనాలకు, ఆర్‌ఇసిఎస్ ఉద్యోగులకు హానికరమైన విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకోవడం అవసరం.
కొన్ని సానుకూల అంశాలు
మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.11,741.18 కోట్లు లోటు అంచనా చూపగా ఎపిఇఆర్సి సునిశిత అధ్యయనం గావించి నికరలోటు రూ. 7,433.80 కోట్లుగా నిర్ణయించినందున రూ.4,307.38 కోట్ల భారం వినియోగదారులపై లేదా ప్రభుత్వంపై పడకుండా నివారించింది. అలాగే 2014-15 నుంచి 2018-19 వరకు నిర్ణయించిన రూ.3,013 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు, 2020-21లో ట్రూ డౌన్ (తాత్కాలిక సర్దుబాటు) రూ. 3,373 కోట్లను పరిగణనలోకి తీసుకున్నందున వినియోగదార్లపై కొత్తగా భారం పడలేదు. వివిధ తరగతులకు రాయితీల కింద సరఫరా చేసే విద్యుత్ వ్యయం 2021-22లో మొత్తం రూ.9,091.36 కోట్లు ప్రభుత్వం భరించడానికి ఆమోదం తెలిపింది. విద్యుత్ ఒప్పందం లేని ప్రయివేటు విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ సేకరించాలన్న యాజమాన్యాల అభ్యర్ధనను ఎపిఇఆర్సి తిరస్కరించడం హర్షణీయం. విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తక్కువ ధరలున్నప్పుడు కొనుగోలు చేసేలా ప్రతీ డిస్కాంలోనూ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం మంచిదే. అయితే ఆ సెల్ పని ఎలా వుందన్నదీ ఇఆర్‌సి పర్యవేక్షించడం అవసరం. అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌసింగ్ మరియు హౌసింగ్ సొసైటీల ఇళ్లనూ గేటెడ్ కమ్యూనిటీ/ విల్లాల మాదిరిగా పరిగణించి హెచ్‌టి-1 గృహ వినియోగదారుల కేటగిరీ ఛార్జీలు వసూలు చేస్తామన్న డిస్కాములు ప్రతిపాదనను ఇఆర్‌సి తిరస్కరించడం సబబైనది.
డిస్కాములు సమర్పించిన ఎఆర్ఆర్లను ఇఆర్‌సి సునిశితంగా పరిశీలించినట్టు కనిపిస్తోంది. నికర లోటు తగ్గించడం, ట్రూ అప్ ప్రతిపాదనను ట్రూ డౌన్‌తో సర్దుబాటు చేయడంతోపాటు విద్యుత్ కొనుగోలు విషయంలోనూ తగిన జాగ్రత్తలను నిర్దేశించింది. ఇలాంటి చర్యల మూలంగా యూనిట్ విద్యుత్ కాస్ట్ ఆఫ్ సర్వీసు వ్యయం రూ.7.17లుగా డిస్కాంలు ప్రతిపాదించగా ఇఆర్‌సి దాన్ని రూ.6.37కు తగ్గించడం గమనార్హం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న రాయితీలు యథాతథంగా కొనసాగిస్తారు. అయితే ఈ సబ్సిడీలను విద్యుత్ చట్టం (2003) సెక్షన్ 65 కింద ఇవ్వాలని ఇఆర్‌సి పేర్కొంది. తద్వారా ఈ రాయితీలకు చట్టబద్ధత సమకూరడమేగాక డిస్కాములకు ప్రభుత్వం నుండి ముందుగా జమ కావడానికీ తోడ్పడవచ్చు.
పవన, సౌర విద్యుత్‌లో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధితో ప్రపంచమంతటా విద్యుదుత్పత్తి వ్యయం తగ్గుతూ వస్తోంది. ఆ ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకూ దక్కాలి. గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలవల్లనే ఇప్పటికీ డిస్కాముల విద్యుత్ కొనుగోలు వ్యయం అధికంగా వుంది. దండగమారి పిపిఎ ల నుండి బయటకు వచ్చినా, సమీక్షించి, తగ్గించుకున్నా ప్రజలకు మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంప్సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తోంది. ఈ విషయంలో డిస్కాములు ఇఆర్‌సి ఇప్పటివరకు అనుమతి పొందలేదు కనుక రైతులకు నష్టదాయకమైన మీటర్ల బిగింపు ప్రక్రియ నిలిపివేతకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశిస్తే అన్నదాతలకు ఊరట.
- బి. తులసీదాస్