Nov 21,2020 21:05

పరిగి (అనంతపురం): సమస్యల పరిష్కారం కోరుతూ అనంతపురం జిల్లా పరిగి మండలంలోని మహిళా గార్మెంట్స్‌ కార్మికులు చేపట్టిన పోరాటం ఫలించింది. సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మొక్కవోని పోరాట స్ఫూర్తితో 11 రోజులుగా ఆందోళనలు చేపట్టారు. వివిధ రూపాల్లో తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. కార్మికుల ఆందోళనతో దిగొచ్చిన యాజమాన్యం వారితో చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేశాయి. దీంతో కార్మికులు శనివారం దీక్షలను విరమించారు. గార్మెంట్స్‌ పరిశ్రమ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పరిగి మండల కేంద్రంలోని ఇండియన్‌ డిజైన్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ గార్మెంట్‌ కార్మికులు ఈనెల 11న మెరుపు సమ్మెను చేపట్టారు. వీరు చేపట్టిన రెండు రోజులకు అదే ప్రాంతంలోని నిషా గార్మెంట్స్‌ కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్లారు. వీరికి సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పరిశ్రమ యాజమాన్యం అన్ని విధాలా ప్రయత్నించింది. పోలీసులతో బెదిరింపులు, అక్రమ అరెస్టులకు పాల్పడింది. ఈ సమయంలో సిఐటియు రాష్ట్ర, జిల్లా నాయకులు కార్మికులకు మద్దతుగా నిలిచారు.పలువురు నాయకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయినా కార్మికులు మొక్కవోని ఆత్మస్థైర్యంతో నిర్బంధాలను తట్టుకుని 11 రోజుల పాటు ఆందోళనను ఉధృతంగా కొనసాగించారు. వరుస ఆందోళనలతో దిగొచ్చిన యజామాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. ఇందులో భాగంగా ప్రధాన డిమాండ్లు అయిన పని వేళల తగ్గింపు, మహిళా కార్మికులపై సూపర్‌వైజర్ల వేధింపుల నియంత్రణ, సమ్మె సమయంలో వేతనం మంజూరు, మధ్యాహ్న భోజన సమయం పెంపు, బోనస్‌, ఉదయం పనివేళల్లో మార్పులు చేసేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. ఇక ప్రధాన డిమాండ్‌ వేతనాల పెంపును మూడు నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. డిమాండ్ల పరిష్కారంపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వడంతో కార్మికులు దీక్షలను విరమించారు. తమ ఆందోళనకు మద్దతుగా నిలిచిన సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలకు గార్మెంట్స్‌ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.