May 17,2022 21:48
  •  పది మందికి అస్వస్థత

ప్రజాశక్తి-పాములపాడు : నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో ఫుడ్‌ పాయిజన్‌తో సోమవారం అర్ధరాత్రి ఒకరు మరణించారు. మరో పది మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, అధికారుల సమాచారం మేరకు.. మద్దూరు మజరా గ్రామం కృష్ణానగర్‌కాలనీలోని ఓ ఇంట్లో ఈనెల తొమ్మిదిన వివాహ వేడుకలు జరిగాయి. అనంతరం 15న బంధువులు, కుటుంబసభ్యులు కలిసి నిర్వహించిన ఫంక్షన్‌లో నాన్‌వెజిటేరియన్‌ తీసుకున్నారు. వారందరూ రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో ఓబులేష్‌ (28), సామేలు, వెంకటస్వామి, ఉష కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఓబులేష్‌ సోమవారం అర్ధరాత్రి మరణించారు. అస్వస్థతకు గురైన మరో పదిమందిని పాములపాడు పిహెచ్‌సికి తరలించారు. జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ మనోహర్‌, తహశీల్దార్‌ విజరు కుమార్‌, ఎంపిడిఒ ఎం.రాణెమ్మ గ్రామాన్ని సందర్శించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ వల్లనే అస్వస్థతకు గురయ్యారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.