Mar 01,2021 19:20

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌ జనాభా దేశ జనాభాలో మూడు శాతం. జాతీయ ఫుట్‌బాల్‌ టీమ్‌లో మాత్రం ఐదో వంతు వారే ఉంటారు. ఎందుకంటేా అక్కడ వారికి బాల్యంతోనే ఫుట్‌బాల్‌ పరిచయం అవుతుంది. వారి జీవితంలో ఒక భాగంగా పెనవేసుకుపోయి ఉంటుంది.

స్వాతంత్య్రం వచ్చి సరిగ్గా ఏడాదికి 1948 లండన్‌ ఒలింపిక్స్‌కు తొలి ఫుట్‌బాల్‌ బృందం హాజరైంది. ఆ పందెంలో చివరిక్షణంలో ఓటమి చూసినా వారు కనబర్చిన ఆటతీరు ఎందరో మనసులు దోచుకుంది. ఎందుకంటే 11 మంది బృందంలో 8 మంది బూట్లు ధరించకుండా ఒట్టికాళ్లతోనే ఫుట్‌బాల్‌ ఆడారు. దీనిపై ఎవరో అడిగితే అప్పటి జట్టు కెప్టెన్‌ టాలిమెరెన్‌ అయో 'మా దేశంలో మేము ఫుట్‌బాల్‌ ఆడతాము. బూట్‌బాల్‌ కాదు' అని సమాధానమిచ్చారంట. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెద్ద సంచలనం. అప్పటి లండన్‌ రాజు కింగ్‌ జార్జ్‌ - VI బకింగ్‌హం ప్యాలెస్‌కు ఆ బృందాన్ని ఆహ్వానించి వారి కాళ్లకు ఉక్కు కవచాలేమైనా ఉన్నాయేమోనని పరీక్షించినట్లు ఊహగానాలు కూడా ఉన్నాయి. అంతటి చరిత్ర గలిగిన ఫుట్‌బాల్‌ బృందంలో నేటికీ ఈశాన్య రాష్ట్రాల ఆటగాళ్లు కీలకంగా ఉంటున్నారు. వారి జీవితం ఫుట్‌బాల్‌తో పెనవేసుకుంది.

నాగా గ్రామాల్లో పిల్లలు ఫుట్‌బాల్‌ ఆడడం సాధారణ అంశమే. అది వారి దైనందిన జీవితంలో ఓ భాగం. ఫుట్‌బాల్‌ కొనుక్కునే స్థోమత లేక ఒక్కోసారి పామోలిన్‌ పండ్లతో తయారు చేసిన బంతులను ఉపయోగిస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలు కలిపి తరచూ ఫ్రెండ్లీ మ్యాచులు నిర్వహించుకుంటాయి. వాటిని గ్రామప్రజలు ఎంతో ఆదరణ చూపుతారు. ఆట ఆడే ప్రదేశానికి పిల్లలు నడవలేకపోతే భుజాలపై ఎత్తుకుని మరీ వారిని అక్కడకు చేరుస్తుంటారు. ప్రతిరోజూ ఉదయం గ్రామంలోని ప్రతి ఇంట్లో ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ తప్పక ఉంటుంది.

నాగా గ్రామాలు అత్యధికం ఎత్తైన కొండల మీద ఉంటాయి. ప్రతి కొండ చివర ఒక ఫుట్‌బాల్‌ పిచ్‌ తప్పక ఉండడం నాగాలాండ్‌ ప్రత్యేకత. 'మేము నడవడం ప్రారంభించినప్పటి నుంచే ఆట ఆడడం నేర్చుకుంటాం' అంటాడు 20 ఏళ్ల యువ ఆటగాడు నయోమి.