May 17,2022 19:02

బెంగళూరు : ఫ్యాట్‌ సర్జరీ ఫెయిల్‌ అవ్వడం వల్ల కన్నడ నటి చేతన రాజ్‌ (21) మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..చేతన రాజ్‌ సోమవారం (మే 16వ తేదీ)నాడు ఫ్యాట్‌ రీమూవ్‌ సర్జరీ చేయించుకునేందుకు రాజాజీనగర్‌లోని డాక్టర్‌ శెట్టీస్‌ కాస్మోటిక్‌ క్లినిక్‌లో చేరారు. సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తులోకి నీరు చేరడమే కాక, గుండెపోటు రావడంతో.. ఆమె మంగళవారం మృతి చెందింది. అయితే ఆపరేషన్‌ చేయించుకునేందుకునే ముందు ఆమె తన తల్లిదండ్రులతో చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, సరైన సౌకర్యాలు లేని ఐసియులో వైద్యులు సర్జరీ చేశారని, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని చేతన్‌రాజ్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజంగా కొవ్వును తొలగించాల్సిన అవసరం ఉంటేనే సర్జరీ చేయాలని డాక్లర్లు సూచించినా.. వాటిని పట్టించుకోకుండా తమ కుమార్తెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చేతన్‌ తండ్రి వరదరాజు ఆరోపించారు. తన కుమార్తెను ఆపరేషన్‌కి తీసుకెళ్లే ముందు తన స్నేహితుడే సమ్మతి పత్రంపై సంతకం చేశాడని ఆయన అన్నారు.
కాగా, ఆపరేషన్‌ తర్వాత చేతన్‌రాజ్‌ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. గుండెపోటు వస్తే.. సిపిఆర్‌ పద్ధతిలో ఆమెకు 45 నిమిషాలపాటు వైద్యమందించామని, మెరుగైన చికిత్స కోసం సమీపంలోని కాడే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని వైద్యులు చెప్పారు. నటి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్నడ సీరియళ్లలో, సోప్‌ యాడ్‌లలో చేతన్‌రాజ్‌ గుర్తింపు తెచ్చుకున్నారు.