May 25,2023 21:44

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవంపై తలెత్తిన వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాష్ట్రపతిని పక్కన పెట్టి ప్రధాన మంత్రి చేత దీనిని ప్రారంభింపజేయడమంటే ఈ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మును అవమానించడమేనని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానిస్తూ ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి గురువారం దాఖలైంది. సుప్రీంకోరు సీనియర్‌ న్యాయవాది సిఆర్‌ జయసుకిన్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 28న ప్రారంభోత్సవం జరగనున్న పార్లమెంట్‌ భవనానికి సంబంధించిన ఆహ్వానాన్ని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఈ నెల 18న విడుదల చేశారని తెలిపారు. రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ''రాష్ట్రపతి దేశపు ప్రథమ పౌరురాలు. పార్లమెంట్‌కు అధిపతి. దేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలను భారత రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు'' అని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభలతో కూడిన పార్లమెంట్‌కు దేశంలో అత్యున్నత శాసనాధికారం ఉందని, పార్లమెంట్‌ నిర్వహణకు కాల్‌, ప్రోరోగ్‌ చేయడానికి, లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79ని ఉటంకిస్తూ, రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగమని, అందువల్ల ప్రారంభోత్సవానికి దూరంగా ఉండకూడదని తెలిపారు. ఇది లోక్‌సభ సెక్రటేరియట్‌లో మాల్‌ప్రాక్టీస్‌ను స్పష్టం చేసిందని, అందువల్ల ప్రకటన, ఆహ్వానాలు సరైన ఆలోచన లేకుండా ఉన్నాయని పేర్కొన్నారు. ''ప్రధానమంత్రి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని సలహాతో ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్‌, యుపిఎస్‌సి ఛైర్మన్‌, సిఇసి, ఫైనాన్షియల్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. అటువంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది' అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అక్రమం, ఏకపక్షం, అధికార దుర్వినియోగం, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ఈ కేసులో లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్ర హోం శాఖతోపాటు న్యాయశాఖను పార్టీలుగా చేర్చారు.