Nov 24,2022 06:40

నా పచ్చ దళముతో కాపలా కాసి
నా మేను సింహాసనమ్ముగా చేసి
రక్షింతు రక్షింతు ప్రాణాలు పోసి
తినడానికిత్తులే ధాన్యాల రాశి

నిన్ను రాజును చేసి పులకించినాను
నువ్వు నా బిడ్డవని పరవశించాను

ఆకువింజామరలతో నీకు విసిరి
ఆకలైతే పండ్లు తినుపింతు కొసరి
ఊడలను ఉయ్యాలగా నీకుగట్టి
కోయిలమ్మను జోలపాటకై పెట్టి

నిన్ను రాజును చేసి మురిసిపోయాను
నువ్వు నా బిడ్డవని కరిగిపోయాను

ఆటకై పచ్చికను నేలంత పరచి
పాటకై వెదురునే వేణువుగ మలచి
మాటలకు చిలుకమ్మనే వెంట పిలచి
తోటలో తేనెపట్టును దాచిపెట్టి

నిన్ను రాజును చేసి గర్వపడ్డాను
నువ్వు నా బిడ్డవని సర్వమిచ్చాను

పయనించకోరు హరిత కవచాన్ని వీడి
కత్తి, గొడ్డలి బూని చేయకోరు దాడి
బుగ్గి జేయును నిన్ను పుడమిపై వేడి
సాటి జీవుల చంపకుండుటే పాడి!


- కిలపర్తి దాలినాయుడు
సాలూరు