Mar 19,2023 16:49
  • చలో అసెంబ్లీ నీ భగ్నం చేసేందుకు యత్నం
  • జిల్లా వ్యాప్తంగా గృహ నిర్బంధాలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం కోసం చలో విజయవాడకి పిలుపునిస్తే అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు వెళ్లకుండా పోలీసులు నిర్బంధాలకు పాల్పడుతున్నారు. సోమవారం చలో విజయవాడ చేపట్టిన అంగన్వాడీలను వెళ్లనీయకుండా పోలీసులు ఆదివారం ఉదయం నుంచి అంగన్వాడీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్భంధం చేస్తున్నారు. విజయనగరంలో ఉన్న జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మి, జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, గంట్యాడలో ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి అనసూయ, రామబద్ర పురం ఇలా అన్ని చోట్లా అంగనవ్వాడే కార్యకర్తలు, సిఐటియు నాయకులు ఇళ్లకు వెళ్లి నిర్బందిస్తున్నారు. 

  • గృహ నిర్భంధం అన్యాయం

అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరితే గృహ నిర్బంధం చేయడం దారుణం.. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మీ, జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనసూయలు ఖండించారు. అంగన్వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్స్ ప్రమోషన్లు రాజకీయజోక్యం అరికట్టాలని, ఫేస్ యాప్ రద్దు తదితర సమస్యలు పరిష్కారం కొరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 20న శాంతి ధర్నా చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీగా నిర్ణయించుకున్నాం. పోలీసులకు పర్మిషన్ పెట్టాము. అధికారులకు వినతిపత్రం ఇచ్చాము.అయినా ప్రభుత్వం దుర్మార్గంగా అంగన్వాడీలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహారం చేయడాన్ని జిల్లా కమిటీ ఖండిస్తోంది.అంగన్వాడీలు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని గ్రాట్యూటీ అమలు చేస్తామని ప్రకటన చేయాలి. మిగిలిన ఇతర సమస్యలు పరిష్కారం కొరకు యూనియన్ అన్ని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాము. మార్చి 20 విజయవాడలో అలంకార్ సెంటర్లో జరిగే ధర్నాలో అంగన్వాడీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు.