
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఈనెల 24వ తేదీన మండల పరిధిలోని వెంకట రాజంపేట దగ్గర గల పెట్రోల్ బంకు వద్ద హత్యకు గురికాబడిన కళావతి హత్య కేసు మిస్టరీని రూరల్ పోలీసులు ఛేదించారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శివ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ హత్యకు గురైన మహిళ సాకే కళావతి అనంతపురం జిల్లా, కదిరి మండలం, బత్రేపల్లి గ్రామవాసి అని తెలిపారు. ఇటీవల కడప నగరంలో జీవిస్తూ రాజంపేటలో పడుపు వృత్తి ద్వారా జీవనోపాధి సాగించేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఈనెల 24వ తేదీ తెల్లవారుఝామున జాతీయ రహదారిలో వెంకటరాజంపేట సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజునాథ గురువిస్ అనే లారీ డ్రైవర్ తో ఒప్పందం కుదుర్చుకొని లారీ డ్రైవర్ చెల్లించిన రూ 500 లలో తిరిగి రూ 200 ఇవ్వకుండా చెంప పైన చేయి చేసుకున్నందువలన ఆవేశంతో ఆ మహిళ గొంతు నులిమి హత్య చేసినట్లు లారీ డ్రైవర్ మంజునాథ గురువిస్ ఒప్పుకున్నట్లు తెలియజేశారు. మృతురాలి కుమారుడు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయి లోకేషన్ గుర్తించి అతి తక్కువ సమయంలోనే కేసును ఛేదించడం జరిగిందని తెలిపారు. కే ఏ53సి 7682 అనే నెంబరు గల లోడు లారీని, లోడుకు సంబందించిన బిల్లులు, ముద్దాయి చరవాణి స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలియజేశారు. కేసు చేదనలో చొరవ చూపిన రూరల్ సీఐ పుల్లయ్య, ఎస్సై భక్తవత్సలం, హెడ్ కానిస్టేబుల్ నందకుమార్, కానిస్టేబుల్ అంజిరెడ్డి, చంద్రమోహన్ లను డిఎస్పి శివ భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి రివార్డును అందజేశారు.