Sep 25,2021 12:44

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : కేంద్ర బిజెపి ప్రభుత్వం పోర్టుల ఆస్తుల (31 ప్రాజెక్టులను బెర్తుల) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ పబ్లిక్‌ సెక్టార్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్లిక్‌ సెక్టార్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కో-కన్వీనర్‌ కుమారమంగళం మాట్లాడుతూ... గతంలో విశాఖ పోర్ట్‌ లో ఉండే ఒక బెర్తును అదానికి ఇచ్చారని, దానిని ఒక ఏడాదిపాటు నడిపి, ఇప్పుడు మూసివేశారని అన్నారు. దానివల్ల పోర్ట్‌ కి సుమారుగా రూ.500 కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. దీనికి మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పోర్టులో 8 బెర్తులు పిపిపి, బి ఓటి పేరుతో ప్రైవేటు వారికి ఇచ్చారన్నారు. గతంలో కాగ్‌ నివేదిక ప్రకారం పిపిపి, బిఓటి కి ఇవ్వడం వల్ల నష్టం జరిగింది తప్ప ఉపయెగం ఏమీ లేదని చెప్పిందని, దీనికి సమాధానం చెప్పాలని కోరారు. పోర్టులో సిఐటియు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌ పద్మనాభ రోజు మాట్లాడుతూ... మేజర్‌ పోర్టులలో లక్ష ఎకరాల భూమి ఉందని, పోర్టులు ప్రైవేటీకరణ జరిగితే దీన్ని కాజేయడానికి తప్ప ఇంకోటి కాదని అన్నారు. ఇప్పటికే ఈ భూమిపైన వివిధ రకాల పరిశ్రమలు నడుస్తున్నాయని వాటి పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతాంగం, స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు, రక్షణరంగ కార్మికులు పెద్ద ఎత్తున పోరాడుతున్నా, తన విధానాలను మార్చుకోకుండా ఇంకా ప్రజాస్తులను పూర్తిగా అమ్మివేయాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా నేషల్‌ మెనిటైజేషన్‌ పైప్‌ లైన్‌ పేరుతో పోర్టులు, రోడ్లు, రైల్వే, విమానం, గ్యాస్‌ ఇతర పైపులైన్‌, స్టేడియం, టెలికం, గిడ్డంగులు, మైనింగ్‌, పట్టణాల్లో కొన్ని కాలనీలు వంటి వాటిని ప్రైవేట్‌ వారికి అప్పగించాలని చూస్తున్నారని అన్నారు. దీనిలో భాగమే మేజర్‌ పోర్టులలో 31 బెర్తలు, విశాఖ పోర్టులో ఈక్యూ 6,7 డబ్ల్యూక్యూ 6, 7, 8 బెర్తలను ప్రైవేట్‌ వారికి అప్పగించాలని చూస్తున్నారని, ఇప్పుడు మళ్లీ ఇవ్వాలని నిర్ణయించడం కార్పోరేట్లకు లాభాలు తేవడానికి మాత్రమేనని అన్నారు. గతంలో ఎస్సార్‌ కీ ఒ.హెచ్‌సి ని ఇచ్చారని, కొత్తగా ఒక పైసా అయినా పెట్టుబడి పెట్టలేదని దీనికీ సమాదానం చెప్పాలి అని అడిగారు. ఈ కార్యక్రమంలో దేవా, శ్రీనివాసు త్రీనాథరావు, బి.జగన్‌, ప్రసాద్‌ సిఎఫ్‌టియు నాయకులు, ఎన్‌.కనకారావు, తదితరులు పాల్గొన్నారు.