
- సరైన సమాచారం లేకుండా సమీక్షలో పారదర్శకత, జవాబుదారీతనం ఎలా?
న్యూఢిల్లీ : పోషణ్ ట్రాకర్‌పై రూ. 1000 కోట్లు ఖర్చు చేసామంటున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన డేటాను మాత్రం వెల్లడించడం లేదు. దీంతో సరైన డేటా లేకుండా పారదర్శకత, జవాబుదారీతనం ఎలా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31నాటికి పోషణ్ ట్రాకర్ (వాస్తవిక పర్యవేక్షణకు సంబంధించిన సమాచార సాంకేతిక పరిజ్ఞానం) పై రూ.1053 కోట్లను ఖర్చు చేశామని విద్య, మహిళలు, బాలలు, యువత, క్రీడలపై స్థాయీ సంఘానికి మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియచేసింది. నవంబరు 30న ఈ మేరకు పార్లమెంట్‌కు నివేదికను అందచేశారు. మొత్తంగా స్మార్ట్ఫోన్ల సమీకరణకు రూ.600కోట్లు, స్మార్ట్ ఫోన్ల రీచార్జ్, నిర్వహణపై రూ.203.96కోట్లు, సాంకేతికతను ఉపయోగిస్తున్నందుకు అంగన్వాడీ కార్మికులు, హెల్పర్లకు ఇచ్చే రాయితీల నిమిత్తం రూ.180.68కోట్లు, శిక్షణకు రూ.68కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రతి అంగన్వాడీలో సాధారణ పోషకాహార లోపం, తీవ్రంగా పోషకాహార లోపం కలిగిన పిల్లల వాస్తవిక డేటాను ఈ ట్రాకర్ నమోదు చేస్తుంది. కానీ ఈ ట్రాకర్‌ను ప్రారంభించి ఇప్పటికి నాలుగేళ్లు అయింది, కానీ ప్రభుత్వం ఇంతవరకు డేటాను వెల్లడించలేదు.
అసలు దేశంలో పోషకాహార లోపం వున్న పిల్లలెంతమంది వున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపి రేవతి రామన్‌సింగ్ రాజ్యసభలో ప్రశ్నించారు. దానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటాపై ఆధారపడి సమాధానమిచ్చారు.
12.3లక్షల అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ రోజువారీ డేటాను పోషన్ ట్రాకర్ ఇచ్చింది. ఇందులో 9.8లక్షల మంది లబ్దిదారులు వున్నారు. వీరిలో ఆరు మాసాల నుండి ఆరేళ్ళ వయస్సు గల పిల్లలు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు వున్నారు. తమకిచ్చిన మొబైల్ ఫోన్ల సాయంతో అంగన్వాడీ కార్మికులు పోషణ్ ట్రాకర్‌కి లాగిన్ అవుతారు, నిర్దిష్ట కాల వ్యవధిలో పిల్లల ఎత్తు లేదా బరువు వంటి డేటాను అందులో పొందుపరుస్తారు. దీన్ని బట్టి పిల్లలు వారి వయస్సుకు తగినట్లు ఎదుగుతున్నారా లేదా అని నిర్ధారిస్తారు. పిల్లలకు వ్యాక్సిన్లు పూర్తయ్యాయా లేదా, గర్భవతులు, పాలిచ్చే తల్లులు పోషకాహారం తీసుకుంటున్నారా లేదా, అసలు అంగన్వాడీకి ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎంతమంది ఇళ్ళకు రేషన్ తీసుకెళుతున్నారు, మధ్యాహ్న భోజనాలు ఎంతమంది తింటున్నారు, వంటి వివరాలన్నీ అందులో పొందుపరచాల్సి వుంది. ఈ డేటా వుంటే జిల్లా స్థాయిలో పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర అధికారులకు వెసులుబాటు వుంటుంది.కానీ ఇంతటి ముఖ్యమైన డేటాకు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేదు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం డేటా, ఆరోగ్య నిర్వహణా సమాచార వ్యవస్థకి సంబంధించిన డేటాలు కనిపించినట్లుగా పోషణ్ ట్రాకర్ డేటా కనిపించడం లేదు. ఇందుకు ప్రైవసీ కారణాలు వున్నాయని అధికారులు చెబుతున్నారు, కానీ అనేక ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డేటా మాదిరిగానే దీన్ని కూడా అదృశ్యం చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
పోషణ్ ట్రాకర్ వెబ్‌సైట్‌ను చూసినట్లైతే జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాలనాపరమైన వివరాలు మాత్రమే వుంటాయి. గత నెల రోజులు, వారం రోజులు, ప్రస్తుత రోజుకు సంబంధించిన హాజరు, వ్యాక్సినేషన్లు, రేషన్, మధ్యాహ్న భోజనం వంటి వివరాలు మాత్రమే ఇందులో వున్నాయి. అంతేకానీ నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ సేవలను సమీక్షించే, లేదా విశ్లేషించే డేటా ఏదీ కనిపించదు. లేదా లబ్దిదారుల పోషకాహార స్థితి వంటి కీలకమైన సమాచారమేదీ లభ్యం కాదు. ప్రభుత్వ ధనంతో జరుగుతున్న ఈ కార్యకలాపాలను, పోషణ్ ట్రాకర్ డేటాను పబ్లిక్ డొమైన్లో వుంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇది అందుబాటులో వుంటే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అంబేద్కర్ వర్శిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఆహార హక్కు ప్రచార సభ్యురాలు దీపా సిన్హా పేర్కొన్నారు.