Aug 05,2022 08:12

* కేంద్రానికి ఇప్పటికే చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ అందజేత
* సిఐటియు సంపూర్ణ మద్దతు
న్యూఢిల్లీ :
కేంద్ర ప్రభుత్వ కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ తపాలా ఉద్యోగులు ఈ నెల 10న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ (ఎన్‌ఎఫ్‌పిఇ), ఫెడరేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ పోస్టల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎన్‌పిఒ)తో కూడిన పోస్టల్‌ జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌ (పిజెసిఎ) ఇప్పటికే సంబంధిత అధికారులకు చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌తో సమ్మె నోటీసును అందజేసింది. ఈ సమ్మెకు సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సిఐటియు ప్రధానకార్యదర్శి తపన్‌ సేన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తపాల ఉద్యోగుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిపై సిఐటియు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ మోనిటైజేషన్‌ పైప్‌ లైన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖనూ ప్రయివేటుకు అప్పజెప్పేందుకు నయా ఉదారవాద విధానాలను బలవంతంగా రుద్దుతోందని తెలిపారు. తపాలా శాఖను కార్పొరేటీకరించడమంటే పరోక్షంగా ప్రయివేటుకు మార్గం సుగమం చేయడమేనని విమర్శించారు. ఇప్పటికే అనేక ఔట్‌ సోర్సింగ్‌ విధానాల రూపంలో ప్రయివేటుకు వివిధ విభాగాలను కట్టబెట్టారని పేర్కొన్నారు. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కార్పొరేటీకరణను, ప్రయివేటీకరణను పెంపొందించేందుకు ఉద్దేశించినవేనని తెలిపారు. వినాశకరమైన కార్పొరేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకొని తపాల శాఖ మనుగడకు కార్యాచరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పని ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా సరిపడ సిబ్బందిని నియమించాలని, ఒకే తరహా పనిచేసేవారందరికీ సమాన వేతనాలను, సమాన ఉద్యోగ భద్రతను, ఇతర రక్షణలు కల్పించాలని కోరారు. పిజెసిఎ ప్రభుత్వం ముందుంచిన 17 డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వ రంగంలోని తపాల సేవలను కొనసాగేలా బలోపేతానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ పిజెసిఎ చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. తపాలా ఉద్యోగుల సమ్మెకు వివిధ రూపాల్లో సంఘీభావం తెలియజేయాలని సిఐటియు అనుబంధ సంఘాలు, ప్రజానీకానికి, కార్మికలోకానికి సిఐటియు పిలుపునిచ్చింది.