Oct 28,2021 15:59

పనాజి :   ప్రజలు మోడీని  తిరస్కరించవచ్చని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ భావిస్తున్నారని, కానీ అది జరగదని, ఈ విషయాన్ని రాహుల్‌ గ్రహించడం లేదని... అదే ఆయనలో ఉన్న పెద్ద సమస్య అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పేర్కొన్నారు. ప్రశ్న, జవాబులు సెషన్‌కు సంబంధించిన ఒక వీడియోను బుధవారం ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఎన్ని ఏళ్లైనా బిజెపి ఎక్కడికి పోదని, ఎన్నికల్లో గెలిచినా, ఓటమి పాలైనా దేశ రాజకీయాల్లో బిజెపి పార్టీ ఉంటుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 40ఏళ్లు గడిచినా కాంగ్రెస్‌ పార్టీ ఎలా మనగలుగుతున్నదో... బిజెపి కూడా అలాగే ఉంటుందని, ఈ విషయాన్ని రాహుల్‌ గ్రహించడం లేదని ప్రశాంత్‌ అన్నారు. ఒక్కసారి జాతీయ స్థాయిలో 30 శాతం కన్నా అధిక ఓట్లను సాధించినట్లైతే... ఆ పార్టీని ప్రజలు తిరస్కరించరని అన్నారు. మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ప్రజలు ఆయనను దూరంగా నెట్టివేస్తారని భావించడం రాహుల్‌ అపోహ మాత్రమేనని అన్నారు. ఒకవేళ మోడీని తిరస్కరించినా బిజెపి పార్టీ మాత్రం ఇక్కడే ఉంటుందని అన్నారు. రాబోయే అనేక దశాబ్దాల పాటు బిజెపితో పోరాడుతూనే ఉండాలని... ఇది ఒక్కరోజులోనో, గంటలోనే ముగిసే వ్యవహారం కాదని అన్నారు. మోడీ బలాన్ని పరిగణనలోకి తీసుకుని, పరీక్షించి, అర్థం చేసుకుంటేనే ఆయనను ఓడించడానికి ఎదురుదాడి చేయగలరని అన్నారు. నిర్మాణాత్మకంగా బలహీనమైన కాంగ్రెస్‌ పార్టీలో లోతుగా పాతుకుపోయిన సమస్యలకు వెంటనే పరిష్కారం దొరకడం సాధ్యం కాదని అన్నారు.