
- లోక్‌సభ స్పీకర్‌కు పిసిఐ లేఖ
న్యూఢిల్లీ : ఈ నెల 28న జరిగే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా మీడియాను అనుమతించాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పిసిఐ) శుక్రవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పిసిఐ లేఖ రాసింది. ఎలాంటి షరతులు లేకుండా లోక్‌సభ ప్రెస్ గ్యాలరీలోకి మీడియా ప్రవేశాన్ని అనుమతించాలని కోరింది. శాశ్వత ప్రెస్ గ్యాలరీ పాస్‌లు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను గ్యాలరీలోకి అనుమతించని విషయాన్ని లేఖలో పిసిఐ గుర్తు చేసింది. కోవిడ్‌ా19 మహమ్మారి నేపథ్యంలో 2020 బడ్జెట్ సెషన్‌లో మీడియా ప్రతినిధులపై ఆంక్షలు అమలు చేశారని, తరువాత కాలంలో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసినా.. జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలను సడలించలేదని లేఖలో పిసిఐ తెలిపింది. జర్నలిస్టులపై ఆంక్షలకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన కారణాలు చెప్పడం లేదని, కాబట్టి ఇలాంటి ఆంక్షలు మీడియాను నియంత్రించడానికి, స్వతంత్ర వార్తా కథనాల స్వేచ్ఛా ప్రవాహానికి ఆటంకం కలిగించడానికి, పత్రికా స్వేచ్ఛను పరిమితం చేయడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న ఎజెండాలో భాగంగా విశ్వసించాల్సి వస్తోందని పిసిఐ లేఖలో విమర్శించింది. అలాగే రద్దు చేసిన లోక్‌సభ ప్రెస్ అడ్వైజరీ కమిటీని తక్షణమే పునరుద్ధరించాలని పిసిఐ డిమాండ్ చేసింది.