Aug 19,2022 17:33

ముంబయి :  మహారాష్ట్ర తీరంలో కొట్టుకువచ్చిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా  కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో ఉగ్రకోణం లేదని మహారాష్ట్ర డిప్యూటి సిఎం, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. ఆ బోటు ఓ ఆస్ట్రేలియా దంపతులకు చెందినదని వెల్లడించారు. అందులో మూడు తుపాకులు ఉన్నాయని తెలిపారు. లేడీ హాన్‌ అని పిలవబడే ఈ పడవ ఆస్ట్రేలియన్‌ పౌరురాలైన హనా లాండర్‌గన్‌కు చెందినది. ఆమె భర్త జేమ్స్‌ హార్బర్ట్‌ కెప్టెన్‌ అని ఫడ్నవీస్‌ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద కోణం కనిపించలేదని అన్నారు. అయితే, తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఆ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించామని ఆయన వెల్లడించారు. అయితే, ఆస్ట్రేలియన్లు ఆ బోటులో ఆయుధాలు ఎందుకు తీసుకెళుతున్నారన్నది తెలియరాలేదని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.