
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పిలుపు మేరకు ఆందోళన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువరు నేతలను పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించారు. ధరల పెంపు, నిత్యావసర వస్తువులపై జిఎస్టి, నిరుద్యోగం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రపతిభవన్, ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దూకి మరీ ప్రియాంక గాంధీ తన నిరసన తెలిపారు. దీంతో ప్రియాంకను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్ ఎక్కించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాయల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు ర్యాలీకి అనుమతించకపోవడంతో ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎక్కి దూకి రహదారిపై కూర్చుని ధర్నా చేపట్టారు. అయితే ఆందోళనను విరమించాలంటూ పోలీసులు ఆమెని అడ్డుకున్నారు. ప్రియాంక అంగీకరించకపోవడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్ ఎక్కించారు. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల సమయంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ధరల పెరుగుదలను మంత్రులు చూడలేకపోతున్నారని, అందుకే తాము ప్రధాని నివాసం వరకు వెళ్లి చూపించాలనుకున్నామని, కానీ తమపై కేంద్రం దౌర్జన్యం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. కేంద్రం తీరుపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న ఓ మహిళా నేత పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.