Jan 30,2023 21:02

వాషింగ్టన్‌ : పోలీసుల చేతిలో నల్ల జాతీయుడి హత్యకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలను కొనసాగుతున్నాయి. హత్యకు గురైన టైరోన్‌ నికోలస్‌ న్యాయం జరగాలని డిమాండ్‌తో ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాజధాని వాషింగ్టన్‌తో పాటు మెంఫిస్‌, న్యూయార్క్‌, శాక్రమెంటో, లాస్‌ ఏంజిల్స్‌, అట్లాంటా, ఫిలడెల్ఫియా, సీటెల్‌ వంటి నగరాల్లో భారీ నిరసనలు జరిగాయి. నికోలస్‌ న్యాయం చేయాలనే డిమాండ్‌తో పాటు, పోలీసులు ఇలాంటి దారుణ చర్యలకు ఇకనైనా ముగింపు పలకాలని కూడా డిమాండ్‌ చేశారు. వాషింగ్టన్‌లో వైట్‌ హౌస్‌ ముందుతో పాటు వివిధ రోడ్లపై ప్రజలు నిరసనలు నిర్వహించారు. న్యూయార్క్‌లో జరిగిన నిరసనల్లో నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ మాట్లాడుతూ నికోలస్‌ హత్యను క్రూరమైనది గానూ, అసహ్యకరమైనది గానూ విమర్శించారు. టేనస్సీ రాష్ట్రంలో మెంఫిన్‌ నగరంలో పోలీసు అధికారుల చేతుల్లో దారుణంగా దాడికి గురైన ఆఫ్రికన్‌-అమెరికన్‌ నికోలస్‌ మూడో రోజుల తరువాత ఈ నెల 9న మృతి చెందాడు. కొన్ని రోజుల తరువాత నికోల్స్‌ను పోలీసులు కొడుతున్న వీడియో విడుదలయింది. నికోల్స్‌ను నేలపై పడవేసిన పోలీసులు లాఠీలు, గుద్దులు, తన్నుతూ ఉన్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.