Mar 20,2023 22:30
  • ప్రతిఘటించిన శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు
  • పోలీసు స్టేషన్లో నిరాహారదీక్ష
  • అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జిఓ నెంబరు 1 రద్దు చేయాలని పోరాట కమిటీ ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపు ఉద్రిక్తంగా మారింది. విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం ముందున్న అంబేద్కర్‌ విగ్రహం నుండి అసెంబ్లీకి బయలుదేరిన పోరాట కమిటీ, సిపిఎం, సిపిఐ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరావు, వి.వెంకటేశ్వర్లు, సిసిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వనజ, టిడిపి నాయకులు రఘు, పరుచూరి ప్రసాదు, కాంగ్రెస్‌ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు తదతరులను అరెస్టు చేసి వేర్వేరు స్టేషన్లకు తరలించారు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నాయకులను ఈడ్చివేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులను ఎత్తి బస్సుల్లో ఎక్కించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగానూ, అక్కడే దీక్షలు చేస్తున్న అంగన్‌వాడీలకు మద్దతుగా నాయకులు కృష్ణలంక పోలీసుస్టేషన్లో నిరాహారదీక్షకు చేపట్టారు. ప్రభుత్వం సరైన సమాధానం చెప్పే వరకూ ఊరుకునేది లేదని బైఠాయించారు. అంతకు ముందు కళాక్షేత్రం వద్ద నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్న జిఓను రద్దు చేయాలని కోరితే అదే జిఓను ఉపయోగించి అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. జిఓ పేరుతో ప్రతిపక్షాలు, ప్రజాస్వామిక వాదుల గళాన్ని మూసేయాలనుకుంటున్నారని విమర్శించారు. తమ సమస్యలు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కును కూడా ఇవ్వడం లేదని అన్నారు. జిఓ1 విడుదల చేసిన తరువాత అధికార పార్టీకి చెందిన నాయకులు విచ్చలవిడిగా రోడ్లపై ప్రదర్శనలు చేస్తున్నారని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడ్డుకోని పోలీసులు ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు అడ్డంకులు పెడుతున్నారని మండిపడ్డారు. న్యాయం కావాలని కోరుతున్న తమను బలవంతంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు బయటకు రాకుండా ప్రజాస్వామ్య హక్కుల గొంతు నులుముతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వ చర్యలను ప్రజలు అంగీకరించబోరని అన్నారు. అసెంబ్లీకి వెళి తమ సమస్యలు చెప్పుకుంటామంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ఆ మాత్రం వినలేరా అని అన్నారు. అధికారపక్ష సభ్యులు ప్రజా సమస్యలపై చర్చించకుండా రౌడీచర్యలకు దిగడం ఏ మాత్రమూ సరైనచర్య కాదని పేర్కొన్నారు. ప్రజాగళాన్ని అణగదొక్కడం ఎవరితరమూ కాదని అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్నానికి ప్రజలు ఘోరీకట్టారని అన్నారు. అక్రమ పద్ధతుల్లో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలిపారు. ప్రభుత్వ విధానాలపై బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు యువజన విద్యార్థి, మహిళలు, లాయర్లు అందరూ రోడ్లపైకి వచ్చారని తెలిపారు. ప్రభుత్వ తీరుపై తిరగబడ్డారని తెలిపారు. నిరంకుశత్వాన్ని సహించేది లేదని అన్నారు. అసెంబ్లీలోనూ ఎమ్మెల్యేలను కొడుతున్నారని, ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రశ్నించిన వారందరిపై వేధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇస్తానన్న హామీలు అమలు చేయలేదని పేర్కొన్నారు. అంగన్‌వాడీలు, కాటికాపరులు అందరూ నేడు రోడ్లపైకి వచ్చారని, సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి దౌర్జన్యపూరిత చర్యలకు దిగడం ఏ మాత్రమూ సరైంది కాదని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో సిపిఐ కార్యదర్శివర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, దోనేపూడి శంకర్‌, సిపిఐ(యం.యల్‌) నగర అధ్యక్షులు రామకృష్ణ, యువజన విద్యార్థి సంఘాల నాయకులు రాము, ప్రసన్నకుమార్‌, శివారెడ్డి తదితరులు ఉన్నారు.

protest-against-go-1-in-vijayawada

 

protest-against-go-1-in-vijayawada

 

protest-against-go-1-in-vijayawada

 

  • సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

కూడళ్లలో ర్యాలీలు, సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జివో నం.1ని రద్దు చేయాలని పౌరసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేయతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకుని నాయకులను అరెస్టులు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఐక్యవేదిక నాయకులను గృహ నిర్బంధం చేయడం గర్హనీయమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఇప్పటికైనా జిఓ నం.1ని రద్దు చేయాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. జివో నం.1కు వ్యతిరేకంగా, అంగన్‌వాడీ సమస్యలపై ఆందోళనలో అరెస్టయిన నాయకులు, కార్యకర్తల పరామర్శకు వెళ్లిన సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధును అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది.